ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నన్ను అడ్డుకుంటారా..! బహిరంగ సభను అడ్డుకోవడంతో, భవనం ఎక్కి ప్రసంగించిన లోకేశ్ - టీడీపీ కార్యకర్తలపై కేసులు

Nara Lokesh : చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో నారా లోకేశ్‌ పాదయాత్ర.. శుక్రవారం ఉద్రిక్తతల మధ్య సాగింది. బంగారుపాళ్యంలో నిర్వహించాల్సిన బహిరంగసభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ..లోకేశ్ రోడ్డు పక్కనే ఉన్న భవనంపైకి ఎక్కి ప్రసంగించారు. దీంతో పాదయాత్రలో వినియోగిస్తున్న 3 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

Nara Lokesh Police
నారా లోకేశ్

By

Published : Feb 3, 2023, 4:51 PM IST

Updated : Feb 4, 2023, 7:43 AM IST

Lokesh Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. 8వ రోజైన శుక్రవారం నాడు.. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. సాయంత్రానికి బంగారుపాళ్యం చేరుకున్న లోకేశ్‌... బహిరంగసభలో ప్రసంగించాల్సి ఉండగా అంతకంటే ముందే సభ ప్రాంతానికి పోలీసులు భారీగా చేరుకోవడం ఉత్కంఠ రేకెత్తించింది.

బహిరంగసభకు అనుమతి లేదంటూ.. లోకేశ్‌ను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులను కార్యకర్తలు అడ్డగించడంతో.. వారి నుంచి తప్పించుకుని లోకేశ్‌.. పక్కనే ఉన్న భవనం పైకి చేరుకున్నారు. అక్కడి నుంచి పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేస్తూ ప్రసంగించారు.

ప్రసంగం ముగిశాక లోకేశ్‌ భవనం పైనుంచి కిందకు దిగక ముందే.. పాదయాత్రలో వినియోగిస్తున్న 3 వాహనాలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకోవడంతో మరోసారి తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే.. పోలీసులు పాదయాత్ర వాహనాలను సీజ్‌ చేశారు.

భవనంపై నుంచి కిందికి వచ్చిన లోకేశ్‌.. పాదయాత్ర వాహనాలను ఇచ్చేస్తే వెళ్లిపోతామన్నారు. వాహనాలను వదిలే సమస్యే లేదని డీఎస్పీ చెప్పడంతో.. ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని లోకేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సజావుగా సాగుతున్న పాదయాత్రను పోలీసులు కావాలనే అడ్డుకున్నారని.. తెలుగుదేశం నేతలు ఆరోపించారు. కేసులు పెట్టడమే పోలీసుల పనిగా మారిందని విమర్శించారు..

బంగారుపాళ్యం ఘటనపై పోలీసులు స్పందించారు. పలమనేరులో నిబంధనలకు విరుద్ధంగా సభ నిర్వహించారని ఏఎస్పీ అన్నారు. బహిరంగ సభ జరిపిన టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. శుక్రవారం మరోసారి నిబంధనలు ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. బంగారుపాళ్యంలో జాతీయ రహదారిపై సభ నిర్వహించారని.. పాదయాత్రలో వాడిన 3 వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ వివరించారు. పోలీసులపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.

వంద కి.మీ. మైలురాయి..: నారా లోకేశ్​ పాదయాత్ర వంద కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. దీనికి గుర్తుగా బంగారుపాళ్యంలో మైలురాయి శిలాఫలకాన్ని లోకేశ్​ ఆవిష్కరించారు.

యువగళం పాదయాత్ర

ఇవీ చదవండి :

Last Updated : Feb 4, 2023, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details