TDP chief Chandrababu open letter on MLC election: ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తున్న వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర ప్రజలకు మూడు పేజీల బహిరంగ లేఖను రాశారు. ఆ లేఖలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకూ చేసిన దుర్మర్గాలు, అరాచకాలు, అవినీతి గురించి ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో, చైతన్యంతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ.. పలు కీలక అంశాలను వివరించారు.
లేఖలో ఏముదంటే?: ''ప్రియమైన రాష్ట్ర ప్రజలకు..!మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం నిరంతరం దాడికి గురవుతూనే వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన జరగనున్న పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికను కూడా ఒక ప్రహసనంగా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెెడ్డి కనుసన్నల్లో అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతంగా మారిన పరిణామాలపై ప్రజలకు, ఓటర్లకు వాస్తవాలను తెలియజేసేందుకే ఈ బహిరంగ లేఖను రాస్తున్నాను.
అధికారం అంటే ఒక ఉన్నతమైన బాధ్యత. ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి చేసేందుకు లభించిన అవకాశం అని భావించే పార్టీ టీడీపీ. ప్రజల అవసరాలు, యువత భవిష్యతును దృష్టిలో పెట్టుకొని.. పాలన చేసిన పార్టీ తెలుగుదేశం. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు కల్పించి యువత భవితకు బాటలు వేశాం. 6లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి వారికి అండగా నిలిచాం. అయితే, నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. యువత భవిష్యత్ అంధకారం అయ్యింది. నేడు ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ గురించి, డీయస్సీ గురించి ఎలా మోసం చేసిందో కూడా చూశాం.
ఇక ప్రభుత్వంలో భాగం అయిన ఉద్యోగులకు ఎప్పుడూ తగిన ప్రాధాన్యం ఇచ్చాం. రాష్ట్ర విభజన సమయంలో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం. వారికి తగు గౌరవం ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్మెంట్ కాదు కదా.. కనీసం ఏ నెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా నేడు లేదు. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద పెట్టి ఎలా అవమానించారో కూడా రాష్ట్రం మొత్తం చూసింది. ఈ అన్ని అంశాలను యువత, పట్టభద్రులు, ఉద్యోగులు, టీచర్లు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను'' అని పేర్కొన్నారు.