CBN On Ramakuppam Statue Issue: అంబేడ్కర్ విగ్రహం వద్ద కూడా కులాల కుంపటి రాజుకోవటానికి ప్రభుత్వ పెద్దల వైఖరే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో అంబేడ్కర్ విగ్రహా ఏర్పాటు సందర్భంగా జరిగిన ఘటనను ఖండిస్తున్నానన్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం పక్కనే వివాదం సృష్టించేలా మరో విగ్రహం పెడతామనటం సరికాదన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం కోసం ఓ వర్గం ర్యాలీ చేసి కావాలనే ఉద్రిక్తతలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంతం నెగ్గించుకోవటం చేసే ఈ చర్యను విరమించుకోవాలని హితవు పలికారు. దళిత సంఘాలు రోడ్డెక్కే వరకు అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా..పోలీసులు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచిది కాదన్న చంద్రబాబు.., దళిత సంఘాల ఆందోళనను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు నివారించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"రామకుప్పంలో విగ్రహ ఏర్పాటుకు ఉద్రిక్తతలు సృష్టించారు. అంబేడ్కర్ విగ్రహం వద్దే ఉయ్యాలవాడ విగ్రహం వద్దు. ఉయ్యాలవాడ విగ్రహం మరో చోట ఏర్పాటు చేయాలి. ఎస్సీ సంఘాలు ధర్నా చేసేవరకు అధికారులు ఏం చేస్తున్నారు ?. ఫిర్యాదును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు ?. కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మంచివి కాదు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు ఆపాలి." -చంద్రబాబు, తెదేపా అధినేత