ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్చకుల మధ్య... దక్షిణ పళ్లెం వివాదం! - chittoor district news latest

ప్రముఖ శైవక్షేత్రమైన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దక్షిణ పళ్లెం కోసం అర్చకుల మధ్య వివాదం జరిగింది. దేవుడి ఎదుటే భక్తుల సాక్షిగా అర్చకులు పళ్లెం నాదంటే నాదంటూ వాగ్వాదానికి దిగారు.

temple
temple

By

Published : Apr 3, 2021, 8:49 AM IST

Updated : Apr 3, 2021, 9:12 AM IST

అర్చకుల మధ్య... దక్షిణ పళ్లెం వివాదం!

దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరాలయ పవిత్రతను పరిరక్షించాల్సిన అర్చకులే... దక్షిణ పళ్లెం కోసం ఘర్షణకు దిగడం చర్చనీయాంశంగా మారింది. శివయ్య చెంత భక్తుల సాక్షిగా అర్చకులు పళ్లెం తనదంటే తనదంటూ వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఆలయంలో అనధికారిక విగ్రహాల ఏర్పాటు అంశం కారణంగా అప్పట్లో ప్రధాన అర్చకులుగా ఉంటున్న సంబంధం గురుకుల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. కొన్నాళ్లకు తిరిగి విధులకు హాజరయ్యారు. గతంలో ఉన్న విధంగా స్వామి వారి ఆలయం వద్ద దక్షిణ పళ్లెం అవకాశం రాకపోవడంపై.. ఆయన పలు దఫాలుగా అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఫలితం లేకుండా పోయింది.

దేవాదాయ శాఖ తనకు ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఇక్కడి అధికారులు సహకారం ఇవ్వడం లేదంటూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ స్థానం మతపరమైన ఆచారాలు, వ్యవహారాలన్నీ సంబంధం గురుకుల్‌ పర్యవేక్షణ ద్వారానే జరగాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారం సంబంధం గురుకుల్‌ స్వామి వారి ఆలయం వద్ద దక్షిణ పళ్లెం తనదేనంటూ అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్‌తో వాదనకు దిగారు. ఆలయ ఈవో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తాను విధులు నిర్వహిస్తున్నానని, ఈవోకు చెప్పి తనను బదిలీ చేయించాలని.. ఎక్కడకు వేసినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కరుణ గురుకుల్‌ చెప్పడంపై.. ఇద్దరి మధ్య స్పర్ధలు తలెత్తాయి.

తాజాగా... శుక్రవారం స్వామివారి గర్భాలయం వద్ద విధి నిర్వహణలో కరుణా గురుకుల్‌ నుంచి దక్షిణ పళ్లెం లాక్కొనే క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భక్తులందరి మధ్య వీళ్లు తిట్టుకున్న వైనం.. వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నరసింహమూర్తి సమక్షంలో ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్‌, ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్‌ ఇద్దరూ ఈవో పెద్దిరాజును కలిశారు. జరిగిన ఘటనపై ఆరా తీసిన ఈవో కేవలం పర్యవేక్షణ బాధ్యత మాత్రమేనని స్పష్టం చేయడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది.

తట్టల కోసం పోరు

ముక్కంటి ఆలయంలో తట్టల పోరు ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఆలయంలోని రాహు, కేతు పూజలతో పాటు స్వామి, అమ్మవార్ల ఆలయాలు, పరివార దేవతలైన వినాయకస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, శనేశ్వరస్వామి, దక్షిణామూర్తి తదితర దేవతామూర్తుల వద్ద అక్కడి అర్చకులు, పరిచారకులు, వేదపండితులకు దక్షిణ రూపంలో ఆదాయం వస్తుంటుంది. ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు వీళ్ల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఇక్కడి ప్రదేశాలకు డ్యూటీలు వేయించుకుంటుంటారు. దక్షిణ తట్టల కారణంగా వచ్చే సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఆలయ అధికారులు శ్రద్ధ చూపాల్సి ఉంది.

ఇదీ చదవండి:

స్టార్ క్యాంపెయినర్లతో వేడెక్కనున్న తిరుపతి లోక్​సభ ఉపపోరు

Last Updated : Apr 3, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details