పట్టించుకునేవారు లేకపోవడం, అధికారుల నిఘా లోపించడం ఫలితంగా.. రాయలసీమలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల పరిధిలోని తంబళ్లపల్లె, కదిరి, రాయచోటి నియోజకవర్గాల్లో ప్రవహించే పాపాగ్ని, పెద్దేరు, చిన్న ఏరు, కుశావతీ నదులతో పాటు.. వాటి పాయల్లో నిండిన ఇసుక.. అక్రమార్కులపరమవుతోంది. గడచిన పదేళ్లలో వర్షాలు లేని కారణంగా వాగులు, వంకలు, నదులు పూర్తిగా ఎండిపోయాయి.
పెద్దేరు కన్నీరు.. ఇసుకనంతా తోడేస్తున్నారు - thrupathi
రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డే లేకుండా పోతోంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకూ.. ఎన్నికలు, తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి చర్యలతోనే గడిచిపోయింది. ఇదే అనుకూలంగా మలుచుకున్న ఇసుకాసురులు.. రెచ్చిపోతున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దేరు నది.. కర్ణాటక సరిహద్దు నుంచి పి.టి.ఎం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల మీదుగా ప్రవహించి కడప జిల్లాలోని గాలివీడు, వెలిగల్లు జలాశయం వరకు సాగుతుంది. ఈ ప్రాంతంలో ఇసుక నిల్వలు భారీగా ఉన్నాయి. చుక్కనీరు లేకుండా ఎండిన పాయలలో ఇసుకను స్మగ్లర్లు తోడేస్తున్నారు. పెద్దేరు పరివాహక ప్రాంతాల ప్రజలు, వ్యవసాయం చేసుకునేవారు, తాగునీటి పథకాల బోర్లు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అధికారులెవరూ అందుబాటులో లేకపోవడం, సిబ్భంది సైతం నిఘా పెట్టని ఫలితం.. యథేచ్ఛగా ఇసుక వ్యాపారం కోట్లల్లో కొనసాగేందుకు దారి చూపింది.
ఇసుక దందాలపై.. సమాచారం ఇవ్వడానికీ సంబంధిత ప్రాంతాలలో ప్రజలు, గ్రామస్థాయి సహాయ అధికారులు భయపడుతున్నారు. ప్రస్తుతం అన్ని మండలాల్లో అధికారుల బదిలీలతో పాలన గాడి తప్పింది. గడచిన ఆరు నెలలుగా ఎన్నికల నిర్వహణతో పాటు బదిలీల పర్వం లాంటి పరిణామాల ఫలితంగా... అక్రమ రవాణా మరింత పెరిగిపోయింది. ఇకనైనా ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోకపోతే.. వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.