ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీఎన్ఎస్​ఎస్​ లో మార్పులు... ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

గాలేరు - నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ఎత్తిపోతల పథకం రెండోదశ నిర్మాణాలను పూర్తి చేయడానికి... ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించింది. 2007లో రూ.1200 కోట్లతో రూపొందించిన అంచనాలు ప్రస్తుతం ఐదు వేల కోట్ల రూపాయలకు చేరాయి. శేషాచల అటవీ ప్రాంతంలో సొరంగాల నిర్మాణాలు, తిరుపతిలో భూ సేకరణ వంటి అవాంతరాలతో నిలిచిపోయిన పనులు పూర్తిచేయడానికి ఈ మార్పులు చేసినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ ప్రతిపాదనల్లో తిరుపతితో సంబంధం లేకుండా కాలువలు నిర్మించడంతో పాటు, రెండు జలాశయాలను తొలగించారు.

planning changes in galeru-nagrai ethipothala scheme in chitthore district
జీఎన్ఎస్​ఎస్​ లో మార్పులు... ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

By

Published : Oct 30, 2020, 9:02 PM IST

చిత్తూరు జిల్లా తూర్పు నియోజకవర్గాలలోని లక్షా మూడువేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించటమే లక్ష్యంగా రూపొందించిన గాలేరు-నగరి సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పనులు పలు కారణాలతో పదమూడు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయం వెనుక ప్రాంతం నుంచి కృష్ణా నదీ జలాలను తరలించేలా 2007లో ప్రణాళికలు రూపొందించారు. 94 కి.మీ.ల మేర ప్రధాన కాలువ, పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఏడు జలాశయాలు, రెండు ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల సొరంగం తవ్వేలా ప్రాజెక్ట్​కు రూపకల్పన చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఉప్పరపల్లి నుంచి శేషాచలం అటవీప్రాంతంలో సొరంగాలు, కాలువలు తవ్వాల్సి రావటంతో పర్యావరణ, అటవీశాఖల అనుమతులు రాకపోవడం, ఆగమశాస్త్రం నిబంధనలు వంటి కారణాలతో పనులు ముందుకు సాగలేదు. ఫలితంగా అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించారు.

ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు...

  • గతంలో ఉన్న 20 కిలోమీటర్ల రెండు సొరంగాల స్థానంలో 16.5 కిలోమీటర్ల ఒకే సొరంగం.
  • శేషాచలం అటవీప్రాంతంలో ఉన్న ఆరు కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌ నిర్మాణాల రద్దు.
  • రెండో సొరంగం తర్వాత తిరుపతి నగరంలో నిర్మించే దాదాపు 25 కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌ రద్దు.
  • తిరుపతి నగరం పరిసర ప్రాంతాల్లో నిర్మించే పద్మాసాగర్‌, శ్రీనివాస సాగర్‌ జలాశయాల రద్దు.
  • 16 కిలోమీటర్ల సొరంగం తర్వాత తుంబురుకోన వాగు ద్వారా నీటిని తరలించేలా ప్రతిపాదన.
  • కైలాసగిరి కాలువపై కొత్తగా లిఫ్ట్‌ నిర్మాణానికి ప్రతిపాదన.

2007లో రూపొందించిన ప్రణాళికల్లో అధికారులు పలు మార్పులు చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గతంలో ప్రతిపాదించిన ప్రాంతంలో భూముల ధర పెరగడం, తిరుపతి నగరంగా మారడంతో నిర్మాణాలకు అడ్డంకులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో జీఎన్‌ఎస్‌ఎస్‌ పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details