పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాల్లో శ్రీవారి లడ్డూల పంపిణీ చర్చనీయాంశంగా మారింది. తిరుమల నుంచి పెద్ద ఎత్తున ట్రేలు తిరుపతికి రావడం.. వాటిలోని లడ్డూలను కవర్లలోకి పెట్టి పంచడంపై విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ బలపరచిన కొందరు అభ్యర్థులు... ఓటర్లకు నగదు, వస్తువులతోపాటు కొన్నిచోట్ల శ్రీవారి లడ్డూలను పంచారు. నాలుగు రోజులుగా నడిచిన ఈ వ్యవహారంలో రేషన్ బియ్యం సరఫరా వాహనాలను వినియోగించుకున్నారు. తిరుమల పోటులో లడ్డూలు తయారు చేసి ట్రేలలో పెట్టి విక్రయకేంద్రాలకు తరలిస్తారు. తిరుమల కాకుండా కరోనాకు ముందు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లోనూ వీటి విక్రయాలు సాగాయి. ఆయా నగరాలకు మాత్రమే తితిదే ప్రత్యేక వాహనంలో లడ్డూ ట్రేలను తరలించే వారు. అంతకుమించి తితిదే అధికారులు.. వ్యక్తిగత అవసరాలకు ట్రేలలో లడ్డూలను పంపిన దాఖలాల్లేవు. అందుకు భిన్నంగా వందల ట్రేలలో లడ్డూలను తిరుమల నుంచి కిందికి పంపినట్లు... వాటిని కవర్లలో పెట్టి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతికి లడ్డూల ట్రేలు ఎలా వచ్చాయనే దానిపై తితిదే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినట్లు, విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
తితిదే తీరుపై విపక్షాల ధ్వజం - తిరుమల లడ్డూ వివాదం న్యూస్
అసలు తిరుమల లడ్డూ ట్రేలు... తిరుపతికి పెద్ద ఎత్తున ఎలా వచ్చాయి? ఎన్నికల కోసం స్వామి వారి లడ్డూలను చంద్రగిరి నియోజకవర్గం పరిధి గ్రామాల్లో.. పంచిపెట్టారన్న ఆరోపణలపై తితిదే సమాధానం చెప్పాలని విపక్షాలు నిలదీస్తున్నాయి.
తితిదే తీరుపై విపక్షాల ధ్వజం