ప్రతిపక్ష నేతపై 'ప్రతినిధి' ఫైర్
వారిద్దరూ రామలక్ష్మణులే: నారా రోహిత్ - jagan
చంద్రబాబు, ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడికి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సినీ నటుడు, చంద్రబాబు తమ్ముడి కుమారుడు నారా రోహిత్ స్పందించారు. వారిద్దరూ రామలక్ష్మణుల్లా కలిసే ఉన్నారని ప్రకటించారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు.
తమ కుటుంబాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తమని రోహిత్ కొట్టిపారేశారు. రాత్రింబవళ్లు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏవిధంగా చూసుకుంటున్నారో.. తమనూ అదేవిధంగా చూసుకుంటున్నారని తెలిపారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయి మీదనే చేయి చేసుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదన్న ఆయన... తమకు పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కోర్టులు, జైళ్లచుట్టూ తిరిగే వారికి కుటుంబ బంధాల గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం తమతో కలిసి చంద్రబాబు సంక్రాంతి పండుగ జరుపుకొంటున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిలా కాకుండా ఒక కుటుంబ పెద్దగా తమకోసం శ్రమిస్తున్నారన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కనుకనే.. ఆయన ఇంటికే పరిమితమయ్యారని తెలిపారు. రాజకీయంగా చంద్రబాబుని ఎదుర్కోలేకనే.. కుటుంబ సభ్యులపై, వారి వ్యక్తిగత విషయాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని రోహిత్ ఆరోపించారు. నారా కుటుంబంలో చీలికలు, మనస్పర్థలు తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దివాళాకోరు తనానికి నిదర్శనమని రోహిత్ అన్నారు.