NARA LOKESH PADAYATRA: వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ జనవరి 27నుంచి మహాపాదయాత్రకు.. సిద్ధమయ్యారు. పాదయాత్రకు 'యువగళం' పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలను.. పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో.. యువగళం జెండాను అచ్చెన్నాయుడు, నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌బాబు, చినరాజప్ప, షరీఫ్, అనిత.. ఆవిష్కరించారు. చంద్రబాబు నియోజకవర్గం.. కుప్పం నుంచి ప్రారంభమయ్యే యాత్ర.. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు సాగుతుందని.. వెల్లడించారు.
యువగళంలో పాల్గొనేందుకు ఓ నెంబర్: రాష్ట్రానికి పెట్టుబడులు రాక, ఉపాధి లేక నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతకు.. భరోసా ఇచ్చేందుకు యువగళం పాదయాత్ర ఓ వేదికని.. పార్టీ నేతలు వెల్లడించారు. ఇదేం ఖర్మలో పెద్ద ఎత్తున వచ్చిన యువత సమస్యలను తెలుగుదేశం అధ్యయనం చేసింది. యువగళం వేదికను రాష్ట్ర యువతకు పరిచయం చేసి నడిపించే బాధ్యతను అధిష్ఠానం లోకేష్‌కు అప్పగించింది. రాష్ట్రంలో కోటీ 50 లక్షల మందికి పైగా నిరుద్యోగులున్నారని అంచనా వేశారు. నిరుద్యోగ సమస్యతో ప్రతి నాలుగు రోజులకు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని.. ప్రతి 8 గంటలకు ఒక మహిళ అఘాయిత్యానికి గురవుతోందని అధ్యయనంలో పేర్కొన్నారు. 9686296862 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే వేదికగా 'యువగళం': ఏపీని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనేది టీడీపీ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడ్డారని విమర్శించారు. వైసీపీ విధ్వంసకర నిర్ణయాలు తీసుకుంటోందని.. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా... ఉన్నవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రూ.17 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని.. నిరుద్యోగ భృతి పెట్టి లక్షలమంది యువకులకు అవకాశమిచ్చామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు పెరిగిపోయిన పరిస్థితి వచ్చిందని.. యువతకు టీడీపీ ద్వారా సరైన వేదిక ఏర్పాటుకు లోకేశ్ శ్రీకారం చుట్టారని తెలిపారు. యువతకు లోకేష్ నాయకత్వం వహిస్తున్నారని.. నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే వేదికగా 'యువగళం' అని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో 400 రోజులు లోకేశ్ పాదయాత్ర చేస్తారని స్పష్టం చేశారు.