ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నారుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు - మారదగట్టులో ముగిసిన చిన్నారుల... అంత్యక్రియలు

వినాయక నిమజ్జనంలో ప్రమాదవశాత్తు మృత్యవాత పడ్డ చిన్నారులకు అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాల నడుమ చిన్నారులకు కన్నీటి వీడ్కోలు పలికారు.

మారదగట్టులో ముగిసిన చిన్నారుల... అంత్యక్రియలు

By

Published : Sep 12, 2019, 5:54 AM IST

చిన్నారులకు తుది వీడ్కోలు

చిత్తూరు జిల్లా వి కోట మండల సరిహద్దులోని కర్ణాటక ప్రాంతం కోలార్ జిల్లా మారద గట్టులో వినాయక నిమజ్జనంలో చోటుచేసుకున్న అపశ్రుతి నాలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఎనిమిది మంది చిన్నారుల్లో ఆరుగురు నీటి కుంటలో పడి మృతి చెందటంతో గ్రామం శోకసంద్రంగా మారింది. ఆరుగురు చిన్నారులు ఆడుతూ పాడుతూ సరదాగా తీసుకెళ్లిన వినాయక విగ్రహం వారి ప్రాణాలను హరించి వేస్తుందని ఎవరూ ఊహించలేదు. సెలవు రోజు కావటంతో పిల్లలు ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లి నీటిలో ముంచేందుకు ప్రయత్నించారు.
నీటిలోకి దిగిన ఓ చిన్నారి బయటికిరాలేకపోగా వారిని కాపాడేందుకు ఒకరి వెంట ఒకరు ఆరుగురు చిన్నారులు నీటి కుంటలో చిక్కుకున్నారు. దీనిని గమనించిన మరో ఇద్దరు చిన్నారులు గ్రామంలో విషయం తెలపడంతో వారు కుంట వద్దకు చేరుకున్నారు. అప్పటికే ముగ్గురు చిన్నారులు మృత్యువు ఒడికి చేరుకోగా మరో ముగ్గురు అపస్మారక స్థితికి చేరుకుని కొంతసేపటికి మరణించారు. మొత్తానికి ఆరుగురు ఒకే గ్రామానికి చెందిన చిన్నారులను మృత్యువు కబళించటంతో మారదగట్ట శోక సంద్రాన్ని తలపించింది. బుధవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల మేర పరిహారాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యుల బంధువుల ఆర్తనాదాల నడుమ చిన్నారులకు కన్నీటి వీడ్కోలు పలికారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details