చిత్తూరు జిల్లాలో నివర్ తుపాను ప్రభావం, సహాయ చర్యలపై.. జిల్లా అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలికాన్ఫెరెన్స్ హించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య, విపత్తుల నిర్వహణ శాఖ, జలవనరులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, విద్యుత్ అధికారులతో పరిస్థితిపై ఆరా తీశారు. నివర్ తుపాను కారణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, జలాశయాల్లో నీటినిల్వలను పరిశీలించి విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
జిల్లాలో 32 టీఎంసీల సామర్థ్యంతో 7648 చిన్న తరహా నీటి పారుదల చెరువులు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వీటిల్లో 18 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు. ముంపు ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలను పునరావాసానికి తరలించాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన 669 చెరువుల్లో అవుట్‌ఫ్లో, ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు గమనించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. 75 శాతం వరకు అన్ని చెరువుల్లో నీటినిల్వను ఉంచి మిగిలిన నీటిని క్రమంగా విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 12 మండలాలపై నివర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రెండువేల మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశాలు ఇచ్చారు.