కోటి కాంతుల వెలుగుల్లో కలియుగ వైకుంఠనాథుడి దివ్యమంగళ రూపం దర్శించుకునేందుకు దక్కిన అవకాశంతో.... భక్తులు పులకరించిపోతున్నారు. సుమారు మూణ్నెళ్ల తర్వాత... శ్రీవారి దర్శనభాగ్యమనే భావన... వారిని ఆనందపరవశులను చేస్తోంది. ప్రయోగాత్మక దర్శనాలు విజయవంతం కావడం వల్ల... తిరుపతిలోని 3 ప్రాంతాల్లో 18 కౌంటర్లలో సామాన్యులకు సర్వదర్శన టోకెన్లను జారీ చేశారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సర్వదర్శనాల కోసం టోకెన్లను.... తిరుపతిలో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులు.... నేరుగా జారీ చేస్తున్న సర్వదర్శన టోకెన్ల కోసమూ భారీగా తరలివచ్చారు.
పోటెత్తిన భక్తజనం...
ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించగా.... భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఒక దశలో రద్దీ అనూహ్యంగా పెరగడం వల్ల.... క్యూలో నిలబడేందుకు పోలీసులు అనుమతించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీవారి దర్శనానికి దక్కిన అవకాశం కావడం వల్ల.... కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి మరీ టోకెన్లు సంపాదించారు. దర్శనభాగ్యం అవకాశం పొందిన వారు.... భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.