ద్రవిడ భాష పరిరక్షణే ధ్యేయంగా విశ్వవిద్యాలయం స్థాపించాలని మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు భావించారు. ఆయన ఆశయాల మేరకు త్రిరాష్ట్ర కూడలి అయిన చిత్తూరు జిల్లా కుప్పంలో 1997లో ద్రవిడ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. అప్పట్లో వర్సిటీ కోసం సుమారు 1,000 ఎకరాలు కేటాయించారు. ఇందులో కొంతమేరే భవనాలు, తరగతి గదులున్నాయి. మరికొంత ప్రాంతం ఖాళీగా ఉంది. కుప్పం పరిసర ప్రాంతాల్లో గ్రీన్ గ్రానైట్ ఉండటంతో.. ఇక్కడ కూడా తవ్వకాలు చేయాలని భావించారు. ఈక్రమంలోనే ఇద్దరు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ ముసుగులో కొంతకాలంగా మరికొందరు అక్రమ మైనింగ్ దందాలోకి దిగారు.
తవ్వకాల్లో 10 నుంచి 15 మంది?
ప్రస్తుతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సుమారు 10- 15 మంది అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతల అండతోనే ఈ వ్యవహారం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. నాయకుడి స్థాయిని బట్టి నెలనెలా రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మీరు ఎంతైనా తవ్వుకోండి.. మాకు నెలకు కొంత ఇవ్వాల్సిందేనని హుకూం జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వ్యవహారం స్థానిక అధికారులకు తెలిసినా ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారు.
డబ్బులు అందకుంటే దాడులే..
అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేస్తున్న వ్యక్తులు.. ఏదైనా నెలలో నాయకులకు డబ్బులు ఇవ్వకుంటే కొందరు అధికారులు రంగంలోకి దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ చేసేవారిలో అత్యధికంగా పొరుగునే ఉన్న తమిళనాడుకు చెందిన వ్యక్తులని స్థానికులు చెబుతున్నారు. రాత్రిళ్లు వర్సిటీ ప్రాంగణం నుంచి గ్రానైట్ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని అత్యధికంగా తమిళనాడు, కొంతమేర కర్ణాటకకు తరలిస్తున్నారు.