చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నేడు పుష్పయాగం జరగనుంది. వేద మంత్రోచ్ఛరణాల మధ్య సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కార్యక్రమాన్ని ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు.
మధ్యాహ్నం స్నపన తిరుమంజనం..
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకిస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.