CM Jagan Released Jagananna Vidya Deevena Scheme Funds: కళాశాలల్లో వసతులు, బోధన సరిగా లేకపోతే.. యాజమాన్యాల్ని ప్రశ్నించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తే 1902 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సెలివిచ్చారు. విద్యా దీవెన నిధుల విడుదల సభను చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నిర్వహించగా.. ఆ సభలో జగన్ ఈ విధంగా సూచించారు.
మరోవైపు జగన్ సభకు బురఖాలు ధరించిన మహిళల్ని అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు సభకు ఎందుకు అనుమతించలేదని మీడియా వారిని ప్రశ్నించగా వారి నుంచి విస్తుపోయే రీతిలో సమాధానాలు వచ్చాయి. బురఖాల ధరించిన మహిళల్ని సభకు అనుమతించకపోవటంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోసారి అధికారం ఇస్తే రెండేళ్లలో ప్రభుత్వ బడులు కార్పోరేట్ బడులతో పోటీ పడేలా చేస్తా
ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని జగనన్న విద్యాదీవెనగా మార్చిన వైసీపీ ప్రభుత్వం.. 3 నెలలకు ఒకసారి నిధులు చెల్లిస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన సభలో బటన్ నొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. 8లక్షల 44వేల 336 మందికి 680 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే.. ఈ పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు.
"ప్రతి తల్లికి చెప్తున్నా ఈ డబ్బు వచ్చిన వారం పది రోజుల వరకు ఆ కాలేజీలకు మీరు వెళ్లండి. పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించండి. బోధన సరిగా లేకపోయినా, వసతులు లేకపోయినా ఆ కాలేజీలను ప్రశ్నించే హక్కు మీకు మీ చేతుల్లో పెడ్తున్నాను. పూర్తి రియంబర్స్ కాకుండా ఆ కాలేజీలు ఇంకో ఫీజు అంటూ అడిగితే 1902కి ఫోన్ చేయండి. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం చర్య తీసుకుంటుంది." -ముఖ్యమంత్రి జగన్