రాజధాని అమరావతి కోసం చిన్న పిల్లలు సైతం రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తోన్న ర్యాలీలో పాల్గొన్న ఆయన.. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. రాజధానిగా అమరావతి ఉండేలా వేంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. ఇంద్రుడు పాలించిన దేవతల రాజధాని పేరు కూడా అమరావతే అన్న ఆయన.. శాతవాహనుల కాలం నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలన జరిగిందని గుర్తుచేశారు. అమరావతిని ఎందుకు మారుస్తున్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. తను తిరుపతిలోనే చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఐకాస ర్యాలీలో పాల్గొనకుండా తెదేపా నేతలను అరెస్టు చేశారని చంద్రబాబు ఆరోపించారు.
రాజధాని అంటే వారికి అపహాస్యమైంది..!
తనను సైతం ర్యాలీలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని అంటే వైకాపా నేతలకు అపహాస్యంగా ఉందని ఆరోపించారు. రాజధాని ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా నాగరికత వెలిసింది నదీతీరాల్లోనే అని స్పష్టం చేశారు. అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ అని గుర్తు చేసిన చంద్రబాబు.. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా? అని నిలదీశారు. హైదరాబాద్ లాంటి రాజధాని ఏపీకి వద్దా అని ప్రశ్నించారు.
ఒక్క పిలుపుతే 33 వేల ఎకరాలు
రాష్ట్ర విభజన తర్వాత అనేక కష్టాలు ఎదుర్కొన్నామన్న చంద్రబాబు... ఒక్క పిలుపు ఇస్తే రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా అన్నదాతలు భూములు ఇచ్చారని తెలిపారు. అమరావతిలో మొత్తం 55 వేల ఎకరాలు ఉందన్నారు. సీఎం జగన్ అభివృద్ధి చేతకాదని, కేవలం విధ్వంసం మాత్రమే వచ్చని విమర్శించారు. విశాఖలో 7 నెలలుగా దొంగలెక్కలు రాస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
రాజధానికి, అభివృద్ధికి సంబంధం లేదు
విశాఖలో రాజధాని పెడితే రాయలసీమ జిల్లాలకు చాలా దూరమవుతుందని చంద్రబాబు అన్నారు. కుప్పం నుంచి విశాఖ వెళ్లాలంటే 950 కిలోమీటర్ల దూరం అవుతుందన్నారు. రాజధాని కావాలని విశాఖ వాసులు ఎప్పుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఒక రాష్ట్రానికి ఒక రాజధానే ఉంటుందన్నారు. 3 రాజధానులని చెప్పడం అవమానం కాదా? అని నిలదీశారు. రాజధానికి, అభివృద్ధికి సంబంధం లేదన్నారు. రాజధాని కాకున్నా విశాఖ నగరం అభివృద్ధి చెందలేదా? అని ప్రశ్నించారు. డేటా సెంటర్, లులూ సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు.
రాజధానిని కాపాడుకోవాలి