Chandrababu Naidu Kuppam Tour: సీఎం జగన్, వైకాపా నాయకులు ఇంటికో సైకోను తయారు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మాదిరి సీఎం జగన్ పోలీసుల్ని అడ్డుపెట్టుకుని నియంతలా వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు కృష్ణదాసనపల్లె, యానాదిపల్లి, జరుగు, గుడ్లనాయనపల్లి, గుడుపల్లె మండలం ఓఎన్‌కొత్తూరు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. తండ్రి వైఎస్‌ను అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు కొట్టేశారని ఆరోపించారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారి ఆకలి తీరుస్తుంటే. వాటిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. వైకాపా వాళ్ల అరాచకాల్ని పోలీసులు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని, పోలీసుల్ని దారిలో పెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
వినాయకచవితి పందిళ్ల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా మైనార్టీలకు అందించిన సంక్షేమ పథకాల్ని ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజల పాణాల్ని పణంగా పెట్టి మద్యంపై 25 వేల కోట్లు అప్పులు తెచ్చారని చంద్రబాబు విమర్శించారు. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తుందని, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాల్ని తెలుగుదేశం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.