Chandrababu Letter to AP and Tamilnadu CS: గత కొన్ని రోజులుగా కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. ఇదే అంశంపై స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు సందర్బాల్లో పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చినా.. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై నేడు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కుప్పంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సీఎస్‌తో పాటు తమిళనాడు సీఎస్‌కు లేఖ రాశారు.
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడులోని క్రిష్ణగిరి, వెల్లూరు జిల్లాలకు జరుగుతున్న గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని లేఖలో చంద్రబాబు కోరారు. శాంతిపురం, కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్ రాళ్లను రాత్రివేళల్లో తరలిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.