చంద్రగిరి రీపోలింగ్ వివాదంపై ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పందించారు. చంద్రగిరి రీపోలింగ్ నిర్ణయం సరైనదేనని స్పష్టం చేశారు. వీడియో దృశ్యాలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైందన్న ద్వివేది... పోలింగ్‌లో అక్రమాలు జరిగినట్లు నిర్ధరణకు వచ్చామని తెలిపారు. పీవో, ఏపీవోలను సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు.
పలువురు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్న ద్వివేది... రెండుసార్లు రీపోలింగ్ జరగకూడదని ఎక్కడైనా ఉందా...? మా దృష్టికి వచ్చినప్పుడు పట్టించుకోకుండా పక్కన పెట్టాలా అని ప్రశ్నించారు. తెదేపా ఫిర్యాదు చేసిన కేంద్రాల్లోనూ వీడియో దృశ్యాలు పరిశీలించామని ద్వివేది వివరించారు. చంద్రగిరిలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి 250మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు ద్వివేది వెల్లడించారు.
లెక్కింపు పర్యవేక్షణకు 200 మంది కేంద్ర పరిశీలకులు...
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణకు 200 మంది కేంద్ర పరిశీలకులు వస్తారని ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించినట్లు వివరించారు. దేశంలో అత్యంత సున్నితమైన ఎన్నికల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్న సీఈవో... ఒడిశాలో ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడు ఉన్నారని తెలిపారు. దేశంలో ప్రతి పార్లమెంట్ స్థానానికి ఒక పరిశీలకుడిని నియమిస్తారని ద్వివేది వివరించారు.