ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తితిదే బోర్డులో సభ్యత్వం కోసం ఎవరినీ సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. తితిదే ప్రత్యేక ఆహ్వానితుడు వై.రవిప్రసాద్ పేరు సిఫారసు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, కేంద్ర పర్యాటకశాఖ తరఫున ఎవరినీ సూచించలేదని ప్రస్తావించారు. తిరుమల పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో 81 మందితో తితిదే జంబో బోర్డు ఏర్పాటు చేశారని ఇప్పటికే తెదేపా ఆరోపిస్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర భాజపా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖతో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది.
తితిదే నూతన పాలక మండలి ఇదే..
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్‌లను నియమిస్తూ మరో ఉత్వర్వును జారీ చేసింది. వీరిద్దరికీ బోర్డులో ఓటింగ్ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్ ఉంటుందని అందులో పేర్కొంది. మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. తితిదే బోర్డు(ttd board)లో మాత్రం గతంలోలాగే మొత్తం 25 మందినే కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని ఇదివరకే నియమించినందున మిగిలిన 24 మంది సభ్యుల జాబితాను బుధవారం ప్రకటించింది.
బోర్డు సభ్యుల సంఖ్యను పెంచనున్నారని కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం సాగింది. బుధవారం కూడా వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. రకరకాల చర్చల తర్వాత పాత బోర్డులాగే సభ్యుల సంఖ్యను 25గానే కొనసాగించాలని నిర్ణయించారు. గత పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావు, పార్థసారథి రెడ్డిలను ఇప్పుడూ కొనసాగించారు. అలాగే వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తెలంగాణ నుంచి మురంశెట్టి రాములు, లక్ష్మీనారాయణ తదితరులకు కూడా వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. ఈసారి పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు కొత్తగా అవకాశం కల్పించారు.
గత బోర్డులో సభ్యులుగా పనిచేసిన ముగ్గురు ఎమ్మెల్యేల స్థానంలో ఇప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్‌లకు చోటు కల్పించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అవకాశం ఇచ్చినట్లు బుధవారం రాత్రి వరకూ అధికారిక వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ఆయన సుముఖంగా లేకపోవడంతో ఆయన స్థానంలో సంజీవయ్యకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు బోర్డులో స్థానం కల్పించారు.
సభ్యులు వీరే:
పోకల అశోక్, మల్లాడి కృష్ణారావు, టంగుటూరు మారుతిప్రసాద్, మన్నే జీవన్ రెడ్డి, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఎన్.శ్రీనివాసన్, రాజేష్ శర్మ, బి.సౌరభ్, మూరంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే), ఏపీ నందకుమార్, పచ్చిపాల సనత్‌కుమార్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్ కేతన్ దేశాయ్, బూదాటి లక్ష్మీనారాయణ, మిలింద్ కేశవ్ నర్వేకర్, ఎంఎన్ శశిధర్, అల్లూరి మల్లేశ్వరి, డాక్టర్ ఎస్.శంకర్, ఎస్‌ఆర్ విశ్వనాథ్‌రెడ్డి(ఎమ్మెల్యే), బుర్రా మధుసూదన్ యాదవ్ (ఎమ్మెల్యే, కనిగిరి), కిలివేటి సంజీవయ్య (ఎమ్మెల్యే, సూళ్లూరుపేట), కాటసాని రాంభూపాల్ రెడ్డి (ఎమ్మెల్యే, పాణ్యం)
- తితిదే ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకమనేది సీఎం, ప్రభుత్వ నిర్ణయమేనని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సభ్యులతో సమానంగా దర్శన అవకాశం ఉంటుందని, బోర్డు సమావేశాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
తితిదేకి 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు
తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి దర్శనానికి సంబంధించినంత వరకు వారిని తితిదే పాలకమండలి సభ్యులతో సమానంగా పరిగణిస్తారని తెలిపింది. ఇప్పుడు నియమించిన తితిదే పాలకమండలి పదవీకాలంతో పాటు, తితిదే ప్రత్యేక ఆహ్వానితుల పదవీకాలమూ ముగుస్తుందని పేర్కొంది.
ఇదీ చదవండి
సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా