ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముక్కనుమ సంబరాలే వేరు.. చిత్తూరు జిల్లాలో పశువుల పరసకు పక్క రాష్ట్రాల ప్రజలు సైతం - Brahmanapalle cattle festival

Cattle festival in Vedurukuppam: తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించుకునే నాలుగు రోజుల పెద్ద పండుగ సంక్రాంతి. పండుగలో భాగంగా చివరి రోజైన ముక్కనుమను ప్రజలంతా కోలాహలంగా జరుపుకొన్నారు. చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పశువుల పండుగ సందర్భంగా పరస కార్యక్రమాన్ని ఆయా గ్రామస్తులు భారీ జన సందోహం నడుమ బ్రహ్మాండంగా నిర్వహించారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పశువులను పూజించి అలంకరించి పరసకు సిద్ధం చేశారు.

Cattle festival in Vedurukuppam
భారీ జన సందోహం నడుమ పశువుల పరస.. పక్క రాష్ట్రాల ప్రజలు సైతం హాజరు

By

Published : Jan 17, 2023, 8:32 PM IST

భారీ జన సందోహం నడుమ పశువుల పరస.. పక్క రాష్ట్రాల ప్రజలు సైతం హాజరు

Cattle festival in Vedurukuppam: చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణ పల్లె, కురివికుప్పం గ్రామాల్లో పశువుల పండుగ సందర్భంగా పరస కార్యక్రమాన్ని ఆయా గ్రామస్తులు భారీ జన సందోహం నడుమ బ్రహ్మాండంగా నిర్వహించారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ పశువులను పూజించి అలంకరించి పరచకు సిద్ధం చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా పలుచోట్ల నిర్వహించే పశువుల పరసకు వెదురుకుప్పం మండలం పెట్టింది పేరుగా నిలుస్తోంది. పశువుల పరసను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి, పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి సైతం ప్రజలు హాజరవడం విశేషం.

వారం రోజుల నుంచి ఏర్పాట్లను సిద్ధం చేసుకున్న గ్రామస్తులు.. పరసలో నిలవడానికి చుట్టుపక్కల గ్రామాల్లో పశువుల యజమానులకు తాంబూలాలు అందించి ఆహ్వానం పలికారు. బ్రాహ్మణ పల్లె గ్రామస్థుల ఆహ్వానం మేరకు పలు ప్రాంతాల నుండి పశువుల యజమానులు తమ తమ పశువులను ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల కోసం ఏర్పాటుచేసిన దొడ్లలో పశువులను నిలువరించి... వాటిని సుందరంగా అలంకరించారు.

బరిలో నిలవడానికి యువత తరలివచ్చి తమ సంసిద్ధత వ్యక్తం చేయడంతో... నిర్వాహకులు డప్పుల హోరు మధ్య ఎద్దులు, కోడెగిత్తలు, ఆలమందలను విడతల వారీగా జన సమూహం వైపు వదిలిపెట్టారు. ఆకలితో నకనకలాడుతున్న పశువులు రంకెలేస్తూ జన సమూహాన్ని చీల్చుకుంటూ వెళ్లే తీరు చూపరులను ఆకట్టుకుంది. వేగంగా పరుగులు తీస్తున్న పశువులను నిలువరించి వాటికి కట్టిన పట్టెడలను సొంతం చేసుకునే క్రమంలో పలువురు యువకులు పశువుల కింద పడి రొప్పుతూ బతుకు జీవుడా అంటూ వెళ్లడం, మళ్లీ పశువులను ఆపడానికి ప్రయత్నించడం విశేషం. పశువుల పరసను తిలకించడానికి వచ్చిన అశేష జనవాహినికి నిర్వాహకులు భోజన వసతి కల్పించారు. చెదురుముదురు సంఘటనలు మినహా పరస ప్రశాంతంగా ముగియడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో పల్లె ప్రాంతాలు జన సంద్రమయ్యాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details