చుట్టూ అందమైన కొండలు... వేసవిలోనూ చల్లని గాలిని పంచే ప్రదేశాలు... వీటికి తోడు సుందరమైన వనాలను పరుచుకున్న ప్రాంతం హార్స్లీ హిల్స్. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ఈ విడిది కేంద్రానికి వేసవిలో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. చిన్నారులకు వేసవి సెలవులు కారణంగా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై వేసవిలోనూ చల్లని వాతావరణం హాయిగా పలకరిస్తుంది. ఈ ప్రాంతంలోని జంతు ప్రదర్శనశాల... ప్రకృతి కార్యశాల పర్యాటకులను అలరిస్తున్నాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు అధికారులు. ఈ కొండపై వెలసిన శ్రీ ఏనుగు మల్లమ్మ ఆలయం.. చల్లని గాలులు వీచే గాలి బండ.. చుట్టుపక్కల సుందరమైన ప్రదేశాలు వీక్షించడానికి ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
హార్స్లీహిల్స్ అందాలు... చూస్తే వాలవు కనురెప్పలు
మండే ఎండలను వెంటబెట్టుకుని వేసవి వచ్చేసింది. విద్యార్థులకూ వేసవి సెలవులు వచ్చేశాయి. వేసవి తాపం తగలకుండా... ప్రకృతి మధ్యన గడపాలని కోరుకుంటుంటారు పర్యాటకులు. ఇలాంటి వారికి నచ్చే ప్రాంతం హార్స్లీహిల్స్. తక్కువ ఖర్చుతో సహజ సిద్ధమైన అందాల మధ్యన ఉల్లాసంగా సేదతీరేందుకు అనువైన ప్రదేశం.
చేరుకోవడం ఎలా?
హార్స్లీ హిల్స్ చేరుకోవడానికి మదనపల్లి ఆర్టీసీ డిపో నుంచి బస్సులు, కొండ కింద కాళ్ల మడుగు కూడలిలో ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు రైలు ద్వారా కురబలకోట, తుమ్మనంగుట్ట , మదనపల్లి సీటీఎం రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి హార్స్లీ హిల్స్ వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
పర్యాటకుల సందడి
ప్రతి ఏడాది మార్చి నుంచి జులై వరకు ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంటుంది. పర్యాటకులకు అసౌకర్యం లేకుండా... రిసార్టులు, హోటళ్లను టూరిజం, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.