Amaravati Farmers padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 37వ రోజూ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. వల్లివేడు మీదుగా పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద రైతులకు స్థానికులు, తెదేపా నేతలు అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నాని, బొజ్జల సుధీర్లు ఘనస్వాగతం పలికారు.
ఈరోజు పాదయాత్ర చింతలపాలెం వరకు యాత్ర కొనసాగనుంది. రాత్రికి చింతలపాలెంలోనే రైతులు బస చేస్తారు. ఇవాళ దాదాపు 16 కిలోమీటర్లు నడవనున్నట్లు అన్నదాతలు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అమరావతి రైతుల పాదయాత్రకు స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యే కొరుగండ్ల రామకృష్ణ.. రైతుల పాదయాత్రకు రూ.10లక్షలు విరాళం ప్రకటించారు.
సొమ్మసిల్లి పడిపోయిన నేత...
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి... సొమ్మసిల్లి పడిపోయారు. జగ్గరాజుపల్లి నుంచి వాంపల్లె వరకు రైతులతో కలిసి నడిచిన ఆయన ఉన్నట్లుండి కిందపడిపోయారు. వైద్య చికిత్స కోసం శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు.