మళ్లీ నేను పుట్టాలని.. దయచేసి కోరుకోకమ్మా! - చిన్నారి హత్య
అమ్మా ఎలా ఉన్నావ్.. నన్ను చూడాలనిపిస్తోందా? నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నా. మనుషుల్లాంటి మృగాలున్న సమాజంలో బతకడం కంటే ఇక్కడే నాకు ఆనందం. మనుషులేంటమ్మా అలా ఉన్నారు? నీ ఒడిలోనే నాకు రక్షణ లేకుంటే ఇంకెక్కడ? దయచేసి నేను మళ్లీ పుట్టాలని కోరుకోకమ్మా. ఇలాంటి మనుషుల మధ్య నేను బతకలేను.
ఆ రోజు హాయిగా నీ ఒడిలో పడుకున్నా. నాకేం తెలుసమ్మా! నీ ఒడిలో సైతం రక్షణ ఉండదని. అయినా తప్పు నాదేలే. నీ కడుపులో ఉన్నప్పుడే చనిపోతే బాగుండు. నీకు.. నాన్నకు ఇంత బాధ ఉండకపోవేమో. ఆ అన్నయ్య నన్ను ఎత్తుకుని తీసుకెళ్తుంటే.. ఆడించడానికనుకున్నా. నాకు తెలియదు కదా? నా జీవితం అక్కడే ఆగిపోతుందని. దండం పెట్టడం ఎలానో తెలిస్తే.... వద్దన్నయ్యా! అంటూ దండం పెట్టేదానినేమో! నాకే మాటలు వస్తే... ఎందుకన్నయ్యా ఇలా చేస్తున్నావని అడిగేదానినేమో. కనీసం కళ్లు తెరిచి సరిగా చూడడం కూడా రాని వయస్సు కదా? నేనేం చేయగలనమ్మా! ఏడ్వడం తప్ప!
మీ సమాజంలో... మగాడికి ఆడదైతే చాలమ్మా.. పెద్దా చిన్నతో పనిలేదు. మళ్లీ జన్మంటూ ఉంటే జంతువులా పుడతా కానీ.. మనిషిలా అస్సలు పుట్టనమ్మా! మనుషుల కంటే వాటికే విచక్షణ ఉందేమో అనిపిస్తోంది. ఆ అన్నయ్యను చంపేద్దామనుకుంటున్నారట! వద్దమ్మా! ఇక్కడికి వచ్చి మళ్లీ అదే పనిచేస్తాడేమోనని భయమేస్తోంది. నీ ఒడిలో ఉన్న నాకే రక్షణ లేకపోతే.. సమాజంలో ఉంటున్న మిగతా ఆడవాళ్ల పరిస్థితి ఎంటో?
ఉంటానమ్మా! నాన్నను ఏడవొద్దని చెప్పు. వీలైతే... ఇంట్లో ఆడది నిద్రపోతుంటే... కుటుంబ సభ్యుల్లోని మగాళ్లనంతా కాపలాగా ఉండమని సమాజానికి సలహా ఇవ్వు!