దశాబ్దాల వైరం ఉన్న నేతలను ఒకే గూటికి తీసుకొచ్చారు. ఉప్పు -నిప్పుగా ఉన్నోళ్లు ఒకే వేదికపైకి రావడమే కాదు పార్టీ విజయానికి కలిసి ప్రచారమూ చేశారు. ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి. నాయకులు కలిసినా కార్యకర్తలు కలవలేదనే లెక్కలు వేస్తోంది తెలుగుదేశం అదిష్ఠానం. ఫలితాల సరళి విశ్లేషిస్తున్నా అధినాయకత్వం వైరి వర్గాల చెలిమితో పార్టీకి నష్టం కలిగిందనే అంచనా వేస్తోంది.
వైరి నేతలను కలిపాం... శ్రేణులను కాదేమో...! - tdp internal thinking loose in election
సార్వత్రిక ఎన్నికల్లో వైరి వర్గాలను ఒక తాటిపైకి తీసుకురావటం పార్టీ కొంపముచ్చిందా..? ఈ క్రమంలో సొంత వర్గాన్ని దూరం చేసుకున్నామా.? నాయకులు కలిసినా క్షేత్రస్థాయిలో క్యాడర్ మాత్రం కలవలేదా..?అనే అంతర్మథనం తెలుగుదేశం పార్టీలో సాగుతోంది. శత్రువులు దగ్గర చేసుకునే ప్రయత్నంలో మిత్రులను కోల్పోయామనే భావనలో ఉంది తెలుగుదేశం.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు ఉప్పు-నిప్పుగా ఉండే నేతలందర్నీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. అందులో అందరిలో ఆసక్తిని రేపిన జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి వర్గాలను ఏకం చేసి ఒకరిని అసెంబ్లీకి మరొకర్ని పార్లమెంటుకి పోటీ చేయించారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి కే.ఈ కుటుంబంతో వైరాన్ని పక్కనపెట్టేలా చేశారు. విజయనగరం జిల్లాలో అశోక గజపతి రాజు, సుజయ్ కృష్ణ రంగారావు, కిషోర్ చంద్రదేవ్‌ను ఒకే తాటిపైకి తీసుకువచ్చి పోటీ చేయించారు. అనంతపురంలో 2014లోనే జేసీ, పరిటాల కుటుంబాలని కలిపారు. చిత్తూరు జిల్లాలోనూ దశాబ్దాల విభేదాలు పక్కన పెట్టి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు. ఈ ప్రయత్నాలేవీ ఎన్నికల్లో ఫలించలేదు.
ఈ కలయికలపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నాయకులు కలిసినంత మాత్రాన శ్రేణులు కలవలేదని వాదిస్తున్నారు. పార్టీలో ఉండి రాజీ పడకుండా పని చేసేవారే ఈ ఎన్నికల్లో విజయం సాధించారని ఉదాహరణగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని కలపటానికి చేయని ప్రయత్నం లేదు. బహిరంగ వేదికల్లోనూ పక్కపక్కన నిలబడటానికి ఇష్టపడేవారు కాదు. చివరికి చెరో స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నాయకుడు అనేవాడు సమస్యలకు ఎదురువెళ్లి విజయం సాధించాలని కార్యకర్తలు కోరుకుంటారు తప్ప రాజీని ఇష్టపడరనే వాదన వినిపిస్తున్నారు పలువురు కార్యకర్తలు. వివిధ వర్గాలను చేరదీసే ప్రయత్నంలో తెలుగుదేశానికి వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలను దూరం చేసుకున్నామనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది.