సీఎం చంద్రబాబు నాయుడు ఈసీ తీరును వ్యతిరేకిస్తూ సీఈసీ సునీల్ ఆరోడాను కలిశారు. రాష్ట్రంలో పోలింగ్ తీరు, ఈవీంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో సహా 15 మంది తెలుగుదేశం పార్టీ నేతలు సీఈసీని కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా విఫలమైందని.. పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కారణాలు చెప్పకుండా బదిలీలు చేశారని తెదేపా ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను గుర్తించకుండా వ్యవహరించారని తెలిపారు. వైకాపా ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని వాపోయారు.... పిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
తెదేపా నేతలపై ఈసీ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారని తెదేపా విమర్శించింది. వైకాపా తప్పుడు ఫిర్యాదులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలు ఓటు వేసే ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ తీవ్రంగా విఫలమైందని...రాష్ట్రానికి అవసరమైన పోలీసుల బలగాలు పంపలేదని ఫిర్యాదు చేశారు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేని ఈవీఎంలను వినియోగించాలని కోరారు. పేపర్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.