ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈవీఎంలు ఇక్కడ ముద్దు... అక్కడ ఎందుకు వద్దు - ఇతర దేశాల్లో

ఈవీఎం విధానంలో  ఎన్నికలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు పోరు బాట పట్టాయి. ఓటింగ్ యంత్రాలలో లోపాలు.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లేకపోవడంపై చర్చను రేకెత్తిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో లేని విధానం మన దగ్గరెందుకని ప్రశ్నిస్తున్నాయి. సాంకేతికతలో ఎంతో ముందున్న అగ్రదేశాలు.. ఎందుకు ఈవీఎంలు వాడటం లేదు. ఓటింగ్ యంత్రాలను పక్కనపెట్టి.. బ్యాలెట్ వైపు ఎందుకు మొగ్గుచూపాయి.? అసలు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత?

ఈవీఎంలు ఇక్కడ ముద్దు...అక్కడ ఎందుకు వద్దు

By

Published : Apr 17, 2019, 6:31 AM IST

Updated : Apr 17, 2019, 8:07 AM IST

ఈవీఎంలు ఇక్కడ ముద్దు... అక్కడ ఎందుకు వద్దు


ఈవీఎం... ఇప్పుడు దేశంలో పెను వివాదం. ఎన్నికల ప్రక్రియ మొత్తంలో విప్లవాత్మక మార్పులకు దిశ చూపిన ఈ యంత్రాలతో కావాల్సిన రీతిలో ఫలితాలను మార్చుకోవచ్చన్న అనుమానాలపై దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ప్రపంచంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం..బ్యాలెట్ వైపే మొగ్గుచూపుతుండటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. మరి భారత్ లాంటి దేశాలు ఈవీఎంలపైనే ఎందుకు ఆధారపడుతున్నాయి...? అభివృద్ధి చెందిన అనేక దేశాలు ఈవీఎంల వాడకాన్ని ఎందుకు నిషేధించాయి..?

ఇప్పటివరకు ఎన్ని దేశాలు....
ప్రపంచంలో ఈవీఎంలను వాడిన, ప్రయోగించిన దేశాలు ఇప్పటి వరకు 31 ఉన్నాయి. వాటిలో నాలుగు దేశాలు మాత్రమే దేశవ్యాప్తంగా వాటిని వాడాయి. 11 దేశాలు కొన్ని ప్రాంతాల్లోనే వినియోగించాయి. మూడు దేశాలు వాటి వాడుకకు స్వస్తి పలికాయి. ప్రయోగాత్మకంగా చూసిన మరో 11 దేశాలు ఆ పద్ధతికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి. కజకిస్థాన్‌ 2011లో ఈవీఎంలకు మంగళం పాడింది. ఇంటర్నెట్‌ ఓటింగ్‌తో ముప్పు ఎక్కువంటూ మరో దేశం ఫిన్లాండ్‌ తేల్చింది.

అమెరికాలో బ్యాలెట్ కే పట్టం
అనేక రంగాల్లో ముందంజలో ఉంటూ అగ్రదేశంగా పేరున్న అమెరికా 18వ శతాబ్దం నుంచి పేపర్ బ్యాలెట్లనే వాడుతూ వస్తోంది. శాస్త్ర-సాంకేతిక రంగంలో అందనంత దూరంలో ఉండే ఈ అగ్రరాజ్యం ఇప్పటికీ పేపర్ బ్యాలెట్​తోనే అధ్యక్ష ఎన్నికలు జరపటం విశేషం. ఈమెయిల్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికి...అందులోనూ బ్యాలెట్ పేపర్ లో వివరాలు నింపి మెయిల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో మాత్రం యంత్రాలు వాడుతుండగా మరికొన్ని మాత్రం వద్దనుకున్నాయి.

బ్యాలెట్ బాట పట్టిన నెదర్లాండ్
తొలినాళ్ల నుంచి బ్యాలెట్ వాడిన కొన్ని దేశాలు తర్వాత ఈవీఎంలపై ఆసక్తి చూపాయి. కానీ కొద్ది కాలానికే బ్యాలెట్​కు జై కొట్టాయి. నెదర్లాండ్ దేశంలో 1990 లో ఈవీఎంలను ప్రవేశపెట్టాయి. 2006 సంవత్సరం నాటికి ఈవీఎంలను వాడకాన్ని ఆ దేశం నిషేధించింది. ఈవీఎంలతో అక్రమాలకు పాల్పడవచ్చని, కచ్చితత్వం, విశ్వసనీయత, భద్రత లోపించిందనే ఆరోపణలు ఆ దేశవ్యాప్తంగా వినిపించాయి. వీటిపై దృష్టి సారించిన ఆ దేశ ప్రభుత్వం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బ్యాలెట్ వ్యవస్థను పునరుద్ధరించింది.

మళ్లీ మొదటికే.. ఐర్లాండ్
ఐర్లాండ్ 2002 సంవత్సరంలో ఈవీఎంలను ప్రవేశపెట్టింది. కానీ కేవలం 7 సంవత్సరాల వ్యవధిలోనే ఈవీఎంల వాడకంపై నిషేధం విధించింది. ఎన్నికల్లో ఈవీఎంల వాడకం ఎంతో ఖర్చుతో కూడినది కావటం... పైగా అన్ని వర్గాల ప్రజలు సముఖంగా లేకపోవటంతో ఈవీఎంలను నిషేధించింది.

జర్మనీలోనూ బ్యాలెట్టే..
జర్మనీ 2005లో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగించింది. కానీ 2007 సంవత్సరంలో అక్కడి కోర్టు నిషేధం విధించింది. కంప్యూటర్ ఆధారిత ఓటింగ్ లో పౌరులకు ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం అవసరమని, అది లేనందున ఈ వ్యవస్థను వాడటం తగదని న్యాయస్థానం పేర్కొంది. పౌరులకు ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేకుండా ఇదే తరహా ఎన్నికలు నిర్వహిస్తే రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

భారత్​లో ఈవీఎంలు
భారత్ లో ప్రయోగత్మకంగా 1982 సంవత్సరంలో కేరళలోని నార్త్ పరవూర్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టించారు. అనంతరం పలు దశల్లో ఈవీఎం యంత్రాలను ఎన్నికల్లో ఉపయోగించారు. దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారు.

ఆఫ్రికాలోనూ అనుమానాలు..
ఈవీఎంల పనితీరుపై అనుమానాలు మన దేశంలోనే కాదు ఆఫ్రికాలోనూ ఉన్నాయి. భారత్‌లో తయారైన ఈవీఎంలను బోట్స్‌వానాలో వినియోగించినప్పుడు అక్కడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. అధికార పార్టీకి అనుకూల ఫలితాలను రాబట్టేలా ఈవీఎంలను వినియోగించారని విపక్షాలు ఆరోపించాయి. బోట్స్ వానా ఈసీ మాత్రం భారతదేశ ఈవీఎంలను గట్టిగా సమర్థించింది.

పత్రాల లెక్కింపునకు యంత్రాలు
దక్షిణకొరియా, యునైటెడ్ కింగ్​డమ్​లోని స్కాట్లండ్ లో మాత్రం 2007 నుంచి బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు యంత్రాలు ఉపయోగిస్తున్నారు.

వివాదాలు కొత్తేమీ కాదు...
⦁ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన భాజపా ఈవీఎంల వాడుకన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల రద్దుకు డిమాండ్ చేస్తూ వచ్చింది.
⦁ 2014 సార్వత్రిక ఎన్నికల్లో వీవీప్యాట్‌లను 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వాడి చూశారు. ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. ఆ 8 నియోజకవర్గాల్లో ఒకచోట (మిజోరం) స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో 117కి గానూ 33 సెగ్మెంట్లలో వీటిని వాడారు. మూడోవంతు యంత్రాల్లో సాంకేతిక సమస్యలు కనిపించాయి.
⦁ వీవీప్యాట్‌లలో 7 సెకన్ల పాటు చీటీ కనిపించాల్సి ఉండగా 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందన్న ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తున్న సాంకేతిక నిపుణుడు వేమూరి హరిప్రసాద్‌ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

భారత ఈవీఎంలపై జర్మనీ పరిశోధకుల ప్రశంసలు..
మన దేశ ఈవీఎంలపై వివాదాలు, విమర్శలు వినిపిస్తుంటే..వాటి పనితీరును, విశిష్టతను జర్మనీ దేశ పరిశోధకులు మెచ్చుకోవటం కొసమెరుపు. అమెరికా వంటి దేశాలు వాడుతున్న యంత్రాలతో పోలిస్తే భారతంలోని ఈవీఎంలు భిన్నమైనవని...మిగిలిన చోట్ల యంత్రాలు భారీగా ఖర్చుతో కూడుకున్న క్లిష్టమైన వ్యవస్థలతో కూడినవి అభివర్ణించారు. భారత ఈవీఎంలు మాత్రం చాలా సరళమైనవిగా, వ్యయం తక్కువ, సమర్థత ఎక్కువ అంటూ పరిశోధకులు కితాబునిచ్చారు.
సాంకేతికతో కూడిన ఏ వ్యవస్థనైనా హ్యాక్ చేయవచ్చని, బ్యాలెట్ తో జరిగే ఎన్నికల్లో అలాంటి వాటికి అవకాశం ఉండదని, అత్యంత భద్రతతో కూడినదిగా చాలా మంది ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాలెట్​ ద్వారా ఓట్లు వేశాక తొలగించలేమని చెబుతున్నారు. బ్యాలెట్ ఎన్నికల్లో విశ్వసనీయతోపాటు కచ్చితత్వం ఉంటుందని అంటున్నారు.

Last Updated : Apr 17, 2019, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details