రైతు రుణమాఫీ పార్టీ హామీ కాదు...అన్యాయం చేయొద్దు! - చంద్రబాబు
రుణమాఫీ చెల్లింపులను ప్రభుత్వం వెంటనే రైతులకు అందజేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేయటం తగదన్నారు. వడ్డీతో సహా అన్నదాతకు ఇవ్వాల్సిన 4, 5విడతల మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.
చంద్రబాబు నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. గతంలో అందజేసిన 4, 5వ విడతల కిస్తీలకు సంబంధించిన రైతు రుణమాఫీ అర్హత పత్రాలను ప్రస్తుతం ఆనర్ చేయాల్సిన అవసరం లేదని వైకాపా నేతలు చేస్తున్న ప్రకటనలపై రైతుల్లో ఆందోళన నెలకొందని నేతలు చంద్రబాబుకు వివరించారు. రైతు రుణమాఫీ పార్టీ హామీ కింద జమకట్టి రైతులకు అన్యాయం చేయడం తగదని చంద్రబాబు సూచించారు. 24వేల 500కోట్ల రూపాయలతో రుణ ఉపశమనానికి సంబంధించి ఇప్పటికే 14వేల 500 కోట్లు రైతుల ఖాతాల్లో పడినట్లు తెలిపారు. 4, 5వ విడతలకు సంబంధించి కూడా రైతుల ఖాతాల్లో 376కోట్లు జమపడిందని, ఇంకా 7,980కోట్లు రైతులకు అందాల్సి ఉందని వెల్లడించారు. ఉద్యాన రైతులకు చెల్లించాల్సిన రుణాలను వీటితోపాటు చెల్లించాల్సి వుందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని తరువాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. అందులో పెండింగ్ బిల్లులను ఎగ్గొట్టడం లాంటివి చేయలేదని శాసన సభ్యులు తెలిపారు. ప్రభుత్వాలు మారితే విధానాలు మారవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై శాసనసభలో, శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి 2వ కిస్తీ 4,500 కోట్లు రైతులకు అందజేస్తే ఈ ఖరీఫ్‌లో పెట్టుబడులకు ఇబ్బందులు ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.