భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కచ్చితత్వం, జవాబుదారితనం లేదని ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన 29 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఎలాంటి సాయం చేయలేదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు, నెరవేర్చిన వాటిపై శ్వేతపత్రం విడదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకుంటామని రోజుకు 17 రూపాయలిచ్చి చేతులు దులుపుకోవడానికి భాజపా చూస్తోందని ఆరోపించారు. ఇలా చేస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు చేసి చూపారని ధీమా వ్యక్తం చేశారు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉన్న ఉద్యోగాలను జీఎస్టీ, నోట్ల రద్దుతో పోగొట్టారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చివరి బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించారని గల్లా జయదేవ్ విమర్శించారు.