ఈనెల 22న ఉపాధ్యాయ ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - గోపాలకృష్ణ ద్వివేది
ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 22 తేదీన ఉపాధ్యాయ ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సంబంధించిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఈ నెల 22 తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఇదే తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 26 తేదీన చేపడతామన్నారు. ఎన్నికల నిర్వహణకోసం పోలింగ్ మరియు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసే కార్యాలయాలకు, సంస్థలకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించేందుకు అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా స్థానిక జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.