ఎన్నికల ముందు తెదేపా అనేక హామీలిచ్చిందని... రుణమాఫీ పేరుతో ఐదేళ్లపాటు రైతులను మోసం చేశారని మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు... తెదేపా ప్రభుత్వం విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్నారన్న కన్నబాబు... తెదేపా హయాంలో రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ సరిగా ఇవ్వలేదని వివరించారు.
రైతు సంక్షేమం గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. చెప్పిన సమయం కంటే ముందే రైతు భరోసాను అమలుచేస్తున్నామని చెప్పిన మంత్రి కన్నబాబు... రైతులు, మహిళలను చంద్రబాబు మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. రైతుల కోసం తెచ్చిన రుణాలను ఇతర అవసరాలకు కేటాయించారని ఆరోపించారు. రైతులు, మహిళల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ ప్రాధాన్యతలు అని స్పష్టం చేశారు.