ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని పెరిగాయంటే! - mbbs
వైద్య విద్యలో చేరాలనుకుంటున్నారా? అయితే శుభవార్త. ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా కింద దేశవ్యాప్తంగా 5,155 సీట్లు పెరిగాయి. అందులో రాష్ట్రానికి 360 సీట్లు కేటాయించారు. వైద్య కళాశాలలో సీట్ల పెంపునకు తగిన విధంగా మౌలిక సదుపాయలు, బోధకుల నియామకాలపై ఎంసీఐ తనిఖీలు చేసి ఆమోదం తెలిపింది.
వైద్య విద్యార్థులకు మంచి అవకాశం ..ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో 360 సీట్లు పెంచినట్లు జాతీయ వైద్య మండలి తెలిపింది. 250 సీట్ల లోపు ఉన్న కళశాలల నుంచి మాత్రమే ప్రతిపాదనలు ఎంసీఐ షరతులు విధించింది. ఈ కారణంగా రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు మినహా 10 వైద్య కళాశాలల్లో సీట్లు పెరిగాయి.
అన్నింటిపై ముందే తనిఖీలు
ప్రస్తుతం 12 కళాశాలల్లో 2వేల సీట్లు ఉన్నాయి. అదనంగా 360 సీట్లు వచ్చాయి. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 190 సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలల్లో సీట్ల పెంపునకు తగ్గట్లుగా మౌలిక వసతులు, బోధకులు నియామకాలు, పరికరాలు వీటన్నిటిపై ఎంసీఐ ముందస్తుగా తనిఖీలు నిర్వహించింది. కేంద్రప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 206 కళాశాలల నుంచి 5286 సీట్లకు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ 37 కళాశాలల్లో సీట్లు పెంచేందుకు ఎంసీఐ అంగీకరించలేదు. 14 కళాశాలల్లో 250 కంటే ఎక్కువ సీట్లు ఉన్నందున వాటిని పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు పెంచాలన్న విషయంపై ఎంసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
22 నుంచి దరఖాస్తుల స్వీకరణ
కొన్ని కారణాల వల్ల అనంతపురం, శ్రీకాకుళం వైద్య కళాశాలల్లో సీట్లు పెరగలేదు. మహారాష్ట్రలో 23 కళాశాలలకు 970 సీట్లు, గుజరాత్లో 28 కళాశాలలకు 790, రాజస్థాన్ లో 14 కళాశాలలకు 450 సీట్లు పెరిగాయి. నీట్ అర్హత సాధించిన విద్యార్థుల నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దరఖాస్తులను కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈనెల 22 నుంచి 28 వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాలని వర్శిటీ అధికారులు సూచించారు. జులై 1 తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ఉపకులపతి సీవీ రావు తెలిపారు. దరఖాస్తు నమూనాలో ఈడబ్ల్యూఎస్ వివరాల నమోదుకూ అవకాశాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు.