వాళ్లు చరిత్రహీనులు!
ప్రతిపక్షంపై మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. పోలీసు పదోన్నతుల్లో ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారనడం తప్పన్నారు. మనిషి ప్రాణానికీ కులాన్ని జతచేయడం జగన్‌కే చెల్లిందన్నారు.
కొండవీడులో చనిపోయిన రైతు బీసీ అని ప్రతిపక్ష నాయజకుడు జగన్ నొక్కి చెప్పడాన్ని మంత్రి లోకేష్ తప్పుబట్టారు. మనిషి ప్రాణానికీ కులాన్ని జత చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. కొన ఊపిరితో ఉన్న రైతును అక్కడే వదిలేశారని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రైతు ప్రాణం కాపాడేందుకు తీసుకెళ్తున్న పోలీసులను మోదీ పంపారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రసంగాన్ని అవసరమైన మేరకే ఎడిట్ చేశారని మంత్రి లోకేష్ ఆరోపించారు. జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదని నిలదీశారు.చింతమనేని మాటలకు సభకు హాజరైన వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారని తెలిపారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా అని లోకేష్ ప్రశ్నించారు. పదే పదే కుల ప్రస్తావన తెస్తూ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు వైకాపా కుట్రలు అర్థమైన రోజున.. ఆ పార్టీ నేతలంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.