నేటి నుంచి నామినేషన్ల పర్వం - నామినేషన్లు
అభ్యర్థుల గుండెల్లో...భయం మెుదలయ్యే రోజు రానే వచ్చింది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ పర్వం నేడే. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ఇవాళ నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నేటి నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 26న పరిశీలన...28తో నామినేషన్ల ఉపసంహరణతో గడువు ముగుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నాలుగో శనివారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తారు.
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 లోక్‌సభ, 175 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నామపత్రాల స్వీకరణకు ఇప్పటికే రిటర్నింగ్ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. నామపత్రాల దాఖలు సమయంలో అధికారులతోపాటు-అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు, పొందుపరచాల్సిన దస్త్రాల వివరాలను ఇప్పటికే రాజకీయ పార్టీల సమావేశాల్లో పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
నిషేధాజ్ఞలు
నామినేషన్ దాఖలు చేసే కార్యాలయం నుంచి వంద మీటర్ల లోపు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించేందుకు ఊరేగింపుగా వచ్చిన వారు... నిర్దేశిత ప్రాంతంలోనే... ప్రదర్శన నిలిపివేయాలి. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరం నుంచి కాలినడక కార్యాలయానికి వెళ్లాలి. శాసనసభకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు నామపత్రంతోపాటు ధరావత్తుగా రూ.10,000...ఎస్సీ, ఎస్టీ పోటీదారు 5వేలు చెల్లించాలి. లోక్‌సభకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు 25 వేలు, ఎస్సీ, ఎస్టీ అయితే రూ.12,500 ధరావత్తుగా చెల్లించాలి. కుల ధ్రువీకరణ పత్రాన్ని జత పరచాలి.
బకాయిలు చెల్లించాలి
నామపత్రంలోని ప్రతి ఖాళీ పూరించాలి. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు బీ-ఫారాన్ని నామపత్రాల దాఖలు చివరి రోజులోపు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ప్రభుత్వ సంస్థలైన విద్యుత్తు, గ్రామ పంచాయతీ, పురపాలక సంఘం వంటి వాటికి గతేడాది నుంచి ఎలాంటి బకాయిలు లేనట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయాలి. రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి నమూనా సంతకం ఇవ్వాలి. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి పేరు ఏ విధంగా ముద్రించాలో తెలియజేస్తూ తెల్ల కాగితంపై తెలుగులో రాసివ్వాలి.
పార్ట్-3 గుర్తుల నమోదు
ఫారం-ఏ, ఫారం-బీలను ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. గుర్తింపు పొందని లేదా స్వతంత్ర అభ్యర్థులు కేటాయించాల్సిన గుర్తులను మూడింటిని ప్రాధాన్య క్రమంలో నామినేషన్ పత్రంలోని పార్ట్-3లోని కాలం ఎదురుగా రాయలి. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ అదే నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన వ్యక్తి ప్రతిపాదించవచ్చు. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను అదే నియోజకవర్గంలోని పది మంది ప్రతిపాదించాలి.
నామినేషన్ పత్రాలను మొదట సహాయ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి ఎన్నికల అధికారికి పంపుతారు. పొందుపరచాల్సిన వివరాలు ఉంటేనే అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతిస్తారు. ఒకే రోజు ఎక్కువ మంది నామినేసన్లు దాఖలు చేయడానికి వస్తే ముందుగా వచ్చిన అభ్యర్థుల వారీగా టోకెన్లు జారీ చేస్తారు. ఒకరి నామినేషను ప్రక్రియ పూర్తైన తర్వాత మరొకరి పత్రాలు పరిశీలిస్తారు. నామపత్రం అందజేసిన తర్వాత చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రిటర్నింగ్ అధికారి నుంచి రశీదు పొందాలి. ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్ట్రర్లు, కరపపత్రాలు-పోస్టర్లు.. ప్లెక్సీలను ముద్రించేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127 కింది సూచనలు పొందాలి.
అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు
* ఎన్నికల అధికారి ముందు ప్రతిజ్ఞ చేసినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.
* నామినేషన్ పత్రాల్లోని లోపాలు- జత పరచాల్సిన పత్రాల సూచికకు చెందిన చెక్‌మెమో తీసుకోవాలి.
* నామినేషన్ వేయడానికి అభ్యర్థి ఫారం-2బీని ఉచితంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తీసుకోవాలి.
* శాసనసభకు నామినేషన్ వేసేందుకు ఫారం-2బీ పూరించాలి.
* కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం-26...అంటే నేరారోపణ అఫిడవిట్‌ను పూర్తిగా నింపాలి. నేరారోపణలు, కేసుల వివరాలు నామపత్రంలోని ఫారం-3లో పూర్తిగా రాయాలి.
* ఒక అభ్యర్థి 4నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు. 2 ఫొటోలు అవసరం. ఒకటి నామినేషన్ పత్రంపై... మరొకటి పారం-26పై అంటించాలి. డిక్లరేషన్ సమర్పించాలి.
* ఎన్నికల్లో పోటీ చేసే వారు నిరక్షరాస్యులైతే నామినేషన్ పత్రంలో వేలిముద్ర వేసినట్లైతే... తిరిగి రిటర్నింగ్ అధికారి ఎదుట వేలిముద్ర వేయాలి.
* ఎన్నికల ఖర్చులకు నామినేషన్ వేసే అభ్యర్థి నామపత్రం దాఖలకు 48 గంటల ముందు తన పేరున కొత్త బ్యాంకు ఖాతా తెరవాలి.