చంద్రబాబు పోరాటయోధుడు: దేవెగౌడ - దేవెగౌడ
ఆంధ్ర ప్రజలు పోరాటయోధులు, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. విభజనతో ఆంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యానించారు.మేమంతా చంద్రబాబు వెంటే ఉన్నామని భరోసానిచ్చారు.
విభజన హామీలు, ప్రత్యేక హోదా డిమాండ్ లపై దిల్లీ వేదికగా ఏపీ సీఎం చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని దేవెగౌడ సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారని అన్నారు. దీక్షలో చంద్రబాబు ధైర్యం, పట్టుదల చూశానని, హామీల సాధనకు తెదేపా ఎంపీలు ఎంతగానో పోరాడుతున్నరని ప్రశంసించారు. నాడు ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలను ఎకతాటిపైకి తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. నేడు అదే తరహాలో భాజపా తప్ప మిగతా పార్టీలన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. నాడు విభజన సందర్భంగా ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేమంతా చంద్రబాబు వెంటే ఉన్నామని భరోసానిచ్చారు. ఆంధ్ర ప్రజలు పోరాటయోధులని, వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.