రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన బెల్ట్ షాపులపై ఇక కొరడా ఝుళిపించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల తొలగింపుపై ఎక్సైజ్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు వంద శాతం తొలగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బెల్ట్ షాపులను నిర్వహించే మద్యం దుకాణాదారుల లైసెన్స్‌లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. కఠినమైన చర్యలు తీసుకునే దిశగా టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగాలన్నారు.
బెల్టు షాపులు తొలగించాల్సిందే! - ముఖ్యమంత్రి జగన్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను తొలగించి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు తేల్చి చెప్పారు. కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు దశలవారీ మద్యనిషేధం కార్యాచరణలో భాగంగా ఇది తొలి అడుగుకావాలని స్పష్టం చేశారు.
అక్రమంగా మద్యం తయారు చేస్తున్న 190 గ్రామాలపై దృష్టి సారించాలని...తక్షణం చర్యలు చేపట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు. బెల్ట్ షాపుల వల్ల ప్రజల ఆరోగ్యాలు, ఆర్థికపరిస్థితి ఛిద్రం అవుతుందని, ముఖ్యంగా యువత సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారని వివరించారు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మద్యం విధానంపై ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలన్నారు. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు మద్యం షాపులను నిర్వహించడం ద్వారా బెల్ట్ షాపులను నియంత్రిస్తున్న విధానాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.