తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విదేశీ పర్యటనలో ఉన్నా... తాజా పరిణామాలపై నాయకులతో చర్చించారు. రాజ్యసభలో నలుగురు ఎంపీలు భాజపాలో చేరటంతోపాటు తెదేపా పక్షాన్ని విలీనం చేయటం చట్ట ప్రకారం చెల్లదని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు కిందకు వస్తుందని నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారు.
అనర్హతవేటు పడే వరకు పోరడతాం
పార్టీ ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యులపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఎంపీలు ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. భాజపా పెట్టిన కేసులకు భయపడి పార్టీ మారిన నేతలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడే వరకు పోరాడాలని నిర్ణయించారు. తెదేపా నాయకులకు భద్రత తొలగించి వైకాపా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. త్వరలో డీజీపీని కలసి ఫిర్యాదు చేయనున్నట్లు నేతలు తెలిపారు.
అప్పుడు వ్యతిరేకించారు..ఇప్పుడు వెళ్లారు!
కాళేశ్వరం ప్రాజెక్టు అంశం సమావేశంలో చర్చికి వచ్చింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లిన అంశంపై నాయకులు చంద్రబాబుతో ప్రస్తావించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ జగన్ 3 రోజులపాటు కర్నూలులో జలదీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాడు జలదీక్షలో జగన్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులే ఏపీ, తెలంగాణ మధ్య వస్తాయని జగన్ అన్న మాటలను ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు. ఇవాళ మరోసారి తెదేపా ముఖ్యనేతలంతా...మరోసారి చంద్రబాబు నివాసంలో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మరోమారు సమావేశం నిర్వహించనున్నారు.
విదేశాల నుంచి టెలికాన్ఫరేన్స్లో చంద్రబాబు ఏం మాట్లాడారంటే?