'వైకాపా పాలన పొరుగు రాష్ట్రాలకు పండగ... ఏపీకి దండగ' - ycp
అమరావతిలో పనుల నిలిపివేతపై సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది తెదేపా. తొలుత చంద్రబాబు.. తెదేపా వ్యూహ కమిటీతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధానికి నిధులు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు వెనుకంజ వేసిందని తెలిపారు.
అమరావతిలో పనుల నిలిపివేతపై ఈ రోజు శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది తెలుగుదేశం. రోడ్ల నిర్మాణం, ఇతర పనుల నిలిపివేతపై చర్చకు పట్టుబడతామని చంద్రబాబు తెలిపారు. లక్షలాది మంది ఉపాధి కోల్పోవడంపై చర్చకు అవకాశమివ్వాలని కోరారు. వైకాపా దౌర్జన్యాల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయన్న చంద్రబాబు... పోలవరం, అమరావతి పనులు పూర్తిగా పడకేశాయన్నారు. ఆగిన పనులు ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడిందని తెలిపారు. వైకాపా పాలన పొరుగు రాష్ట్రాలకు పండగ, ఏపీకి దండగగా మారిందని ఆరోపించారు. పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం వ్యాపించాయని చెప్పారు.దాడులు, దౌర్జన్యాలతో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తెదేపా నేతల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించబోమని తెలిపారు.