ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపులెందుకు దూరమయ్యారు? - రిజర్వేషన్లు

'కాపుల సంక్షేమానికి ఏ ప్రభుత్వమూ ఇవ్వనంత ప్రాధాన్యమిచ్చింది తెలుగుదేశమే. కాపు కార్పొరేషన్, ప్రత్యేక రిజర్వేషన్లు, బీసీల్లో చేర్చడం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశాం. అయినా నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడంతో ఎన్నికల్లో ఓటమి పాలయ్యాం.' ఈ మాటలన్నీ స్వయానా తెదేపాలోని కాపు ముఖ్యనేతలు అధినేత చంద్రబాబుతో అన్నవే.

chandrababu_met_with_kapu_leaders

By

Published : Jul 2, 2019, 10:01 AM IST

తెదేపా ఆవిర్భావం నుంచి కాపులు అండగా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబుకు కాపునేతలు వివరించారు. ఈ ఎన్నికల్లో ఎందుకు దూరమయ్యారో? కారణాలేంటో గుర్తించాలని కోరారు. తెదేపా కాపు సామాజికవర్గ నాయకులు సోమవారం సాయంత్రం చంద్రబాబుతో ఉండవల్లిలోని నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల కాకినాడలో కాపు నేతలంతా భేటీ కావడం, ఆ సందర్భంగా వేర్వేరు ఊహాగానాలు తలెత్తిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

నాయకత్వ లోపమే!
ముద్రగడ పద్మనాభం దీక్షల విషయంలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోయామని నేతలు చంద్రబాబుకు వివరించారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని, ఇంట్లో మహిళలను అవమానించేలా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కాపుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయని వివరించారు. జనసేనతో పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. పార్టీకి కీలకమైన అంతర్గత విభాగం పనితీరు పేలవంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన లోకేశ్, నారాయణ వంటివారు ఎన్నికల్లో పోటీకి దిగడంతో అక్కడ శూన్యత ఏర్పడిందని తెలిపారు. ఆర్థిక వనరుల కొరత బాగా దెబ్బ తీసిందని వివరించారు. కాపులకు నమ్మకం కలిగించేలా నాయకత్వాన్ని ప్రోత్సహించలేదనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరైన నాయకులకు మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్పారు.

సమావేశలొద్దు
నేతల సూచనలన్నీ పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు...లోపాలు సరిదిద్దుకుందాం...సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టొద్దు...ఇలాంటివి పార్టీకి ఇబ్బందికరం. ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని సూచించారు.

మేం ఎక్కడికి వెళ్లట్లేదు
పార్టీ నేతలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, బోండా ఉమామహేశ్వరరావు కదిరి బాబురావు తదితర నేతలు చంద్రబాబుతో సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడారు. తమకు సమస్యలున్నాయి. వాటిని నాయకుడితో పంచుకున్నామని, అధినేత ఆలోచనల్లో లోపాలున్నాయని అంగీకరించారని త్రిమూర్తులు తెలిపారు. తామంతా తెదేపాలోనే ఉంటున్నామని, అపోహలకు తావు లేదని వివరించారు. 'భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై చర్చించాం. తెదేపాను బలోపేతం చేయాలనే..నిర్ణయంతోనే మేమంతా ఉన్నాం. మా నాయకుడి వెన్నంటే ఉంటాం. ఎలాంటి అనుమానాలకు తావు లేదు.' అని జ్యోతుల నెహ్రూ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details