ఆందోళన వద్దు...చరిత్ర పునరావృతమవుతుంది : చంద్రబాబు - mps
తెదేపాకు సంక్షోభాలు కొత్త కాదని అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపాకు కార్యకర్తలు, ప్రజలు అండగా నిలబడిన ప్రతి సారి తిరిగి పుంజుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీలు వారి స్వార్ధ ప్రయోజనాల కోసమే పార్టీని వీడి భాజపాలోకి చేరారన్నారు.
పార్టీని వీడిన ఎంపీల గురించి, పార్టీని గురించి ప్రస్తావిస్తూ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే...
రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాడు భాజపాను వీడామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్లో స్పష్టం చేశారు. ఆ రోజు భాజపా తో వీడకుండా కలిసి ఉంటే తెదేపా పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉండేదని ఆయన అన్నారు. అలా కలిసి ఉంటే రాష్ట్రాన్ని, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టినట్లయ్యేదని, కానీ తాను ఆ పనిచేయలేదన్నారు. తన జీవితం మొత్తం ప్రజల ప్రయోజనాల కోసమే కష్టపడ్డానని, అధికారంలో ఉన్నామా లేదా అన్నది చూడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.