ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం దిల్లీలో చేపట్టిన ధర్మపోరాటసభ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. విభజన చట్టం హామీల అమలు కోసమే నిరసన తెలిపామని స్పష్టం చేశారు. దీక్షకు మద్దతు తెలిపిన జాతీయ పార్టీల నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశమంతా అండగా నిలబడటమే తమ నైతిక విజయమని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందనే భరోసాను జాతీయ నాయకులు ఇచ్చారని చెప్పారు. భావోద్వేగాలతో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న అర్జునరావు విషయంలో ఆవేదన చెందారు. ఆయన కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అర్జునరావు అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు ఎవరూ ఉద్వేగానికి గురి కావొద్దని... ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తమ స్థాయి మరిచి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహించారు. వారు చేసే ఆరోపణలు నిరూపించాలని మరోసారి సవాల్ విసిరారు. సంకీర్ణ ధర్మాన్ని మోదీ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకీ అన్యాయం చేశారనే పోరాడుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు.