పోస్టల్ బ్యాలెట్లపై కొన్నిచోట్ల ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 500 పోస్టల్ బ్యాలెట్లు ఉండొచ్చన్న సీఈవో... ఒక్కొక్కరికీ 2, 3 పోస్టల్ బ్యాలెట్లు అందినట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై కలెక్టర్ల నుంచి నివేదికలు కోరామని వివరించారు. ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తప్పుచేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
పోస్టల్ బ్యాలెట్ బాధ్యత గెజిటెడ్ స్థాయి అధికారులకు అప్పగించామన్న ద్వివేది... ఒక ఉద్యోగికి ఒకటికి మించి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం లేదన్న సీఈవో... ఈనెల 23న కౌంటింగ్ చేసే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కౌంటింగ్ సిబ్బందిపై అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘం దృష్టికి తేవాలని సూచించారు. గెజిటెడ్ స్థాయి అధికారులకు మాత్రమే కౌంటింగ్ విధులు ఇవ్వనున్నట్లు తెలిపారు.