పోలవరం ప్రాజెక్టు పునరావాస కార్యకలాపాల్లో అవకతవకలు జరిగినట్లు తమకు ఎటువంటి పిర్యాదు రాలేదన్నారు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి, భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, సీపీఐ సభ్యుడు డి.రాజా, కాంగ్రెస్ సభ్యుడు జయరాం రమేష్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయ పునరావాస కార్యకలాపాలు జరుగుతాయనీ... స్థానిక కలెక్టర్ కార్యాలయం నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ప్రభుత్వాలకు చేరవేస్తుందన్నారు. పోలవరం నిర్వాసితుల విషయంలో ఇప్పటికే గిరిజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ నియమించారని... ఆ కమిటీ అన్ని అంశాలు పరిశీలిస్తోందని తెలిపారు. అన్ని రకాల అనుమతులు వచ్చినందున... సవరించిన అంచనాల ఆమోదానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి కావాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకు సంబందించిన ఫైల్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగిందని సభకు తెలిపారు. మొత్తం ప్రాజెక్టులో సాగునీటి నిర్మాణం కోసం జరిగే ఖర్చు అంతా 2014 ఏప్రిల్ తర్వాత కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని... రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 5వేల కోట్ల రూపాయలు ఆడిట్ పూర్తైన తర్వాత తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. సవరించిన అంచనాలపై సాంకేతిక నిపుణుల బృందం ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ సూచనలతో మరో కమిటీ నియామకం జరిగినట్టు వివరించారు. ఒకసారి కమిటీ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించిందనీ....త్వరలో మరోసారి భేటీ అవుతున్నట్లు సభకు గజేంద్ర సింగ్ షెకావత్ వివరించారు.
పోలవరం ప్రాజెక్టులో అవతకతవకలు జరిగినట్టు ఫిర్యాదుల్లేవు: కేంద్రం
పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. మూడు పార్టీల సభ్యులు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి గజేంద్రసింగ్ షెకావత్... ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేశారు. అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టులో అవతకతవకలు జరిగినట్టు ఫిర్యాదుల్లేవు: కేంద్రం