ఇకపై సీబీఐ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టొచ్చు! - అనుమతి
రాష్ట్రంలో సీబీఐని అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్ 8న సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతిని నిరాకరిస్తూ జీవో నెంబర్ 176ను గత ప్రభుత్వం జారీ చేసింది.
సీబీఐకి రాష్ట్రంలో మళ్లీ దారులు తెరుచుకున్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థను రాష్ట్రంలోకి అనుమతిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ విచారణ చేసేందుకు అవకాశం కల్పించే సాధారణ సమ్మతిని పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ జీవో నెంబర్ 81 విడుదల చేశారు.
ఐటీ, సీబీఐ దాడులతో తమను లక్ష్యంగా చేసుకున్నారంటూ...గత ప్రభుత్వం సీబీఐని రాష్ట్రంలో నిషేదిస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. సోదాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని ఆరోపించింది. సాధారణ సమ్మతిని ఉపసంహరిస్తూ కిందటి ఏడాది జీవో జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ..తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. కీలక కేసులను ఇకపై సీబీఐ విచారణ చేసే అవకాశం ఉంది.