ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి కోసం రూపొందించిన అఖండ గోదావరి ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రానికి పంపడం మినహా... తెదేపా హయాంలో నిధులు కేటాయించలేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. తెదేపా అవినీతి వల్లే కేంద్రం గతంలో రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు దేశ విదేశాలు తిరగడం తప్ప.. పర్యాటక శాఖను పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసి.. నిధులను సక్రమంగా వినియోగిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి వ్యాఖ్యలపై తెదేపా సభ్యుడు బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. గత ప్రభుత్వంపై నిందారోపణలు కట్టిపెట్టి.. వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. చంద్రబాబు రాష్ట్రంలోని పర్యాటకానికి ప్రత్యేక శోభ తీసుకువచ్చారని కొనియాడారు. గత ప్రభుత్వంపై నిందలు మాని పిచ్చుకలంక అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోరారు.