ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులకు బీఎస్​ఎన్​ఎల్ బంపర్ ఆఫర్! - students

ఏటా లక్షల సంఖ్యలో ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టభద్రులై సమాజంలోకి వస్తున్నారు. చాలామందికి నైపుణ్యం లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మరి... వారిని నైపుణ్యవంతులుగా మలచేదెవరు? రోడ్ల మీద పడుతున్న ఇంజినీరింగ్ నిరుద్యోగుల సంఖ్య తగ్గించేదెవరు? ఈ ప్రశ్నలకు చేతలతో సమాధానం చెబుతోంది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.

bsnl_training_to_students

By

Published : Jun 3, 2019, 6:32 AM IST

విద్యార్థులకు బీఎస్​ఎన్​ఎల్ బంపర్ ఆఫర్

సాంకేతికత ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నా.. విద్యార్థులు దాన్ని అందుకోలేకపోతున్నారు. ఫలితంగా.. చేతిలో పట్టా ఉన్నా.. ఉద్యోగం లేక సున్నాగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు బీఎస్​ఎన్​ఎల్ సంస్థ​ పదేళ్లుగా కృషి చేస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారం ఏటా ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం మే, జూన్ నెలల్లో ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. వారిని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది.

సాంకేతికతకు అనుగుణంగా శిక్షణ

టెలీ కమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ నిపుణులు... శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసి మూడో ఏడాదిలోకి ప్రవేశించే విద్యార్థులు ఈ ఇంటర్న్ షిప్ కోర్సుకు అర్హులు. ఈసీఈ, సీఎస్‌ఈ, ఐటీ విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఇంటర్న్ షిప్​ రూపొందించారు. టెలికాం రంగంలో ఉద్యోగావకాశాల కోసం ఈ శిక్షణ ఉపయోగపడుతోంది. నెల రోజులపాటు కోర్సు ఉంటుంది. ప్రత్యేకంగా నిధులు కేటాయించి... రెండు వారాలు తరగతులు, మరో రెండు వారాలు క్షేత్రస్థాయి శిక్షణ అందిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటర్న్​షిప్​ ధ్రువపత్రాన్ని అందిస్తున్నారు.

3జీ, 4జీ, 5జీ అంటూ.. రోజుకో రకంగా సెల్‌ఫోన్‌ పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. సెల్‌టవర్ల ద్వారా సిగ్నళ్లు, బేస్‌ ట్రాన్సీవర్‌ స్టేషన్‌, బేస్‌ స్టేషన్‌, కంట్రోలర్‌, మొబైల్‌ స్విచింగ్‌ సెంటర్‌, సీడీఎంఏ, జీఎస్‌ఎం, జీపీఆర్‌ఎస్‌, ఎన్‌జీఎస్‌ఎన్‌ వంటి సాంకేతికతను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశం ఈ శిక్షణలో లభ్యమవుతుంది. మైక్రోవేవ్‌ పరిజ్ఞానాన్ని సైతం ఈ శిక్షణలో వివరిస్తారు.

పనిచేసే వారే అధ్యాపకులు

ఈ శిక్షణలో ఇంటర్‌నెట్‌ పనిచేసే విధానాన్ని ప్రాక్టికల్‌గా చూపించి విద్యార్థులకు వివరిస్తారు. ఆప్టికల్‌, కాపర్‌ ఫైబర్‌ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్‌ ఎలా అందిస్తున్నారనేది తెలుసుకోవచ్చు. యూజర్లు, ఐపీ అడ్రస్​ వంటి అనేక సాంకేతిక అంశాలపై పూర్తిస్థాయి అవగాహనను విద్యార్థులకు పెంపొందిస్తారు. లక్షల డేటాకాల్స్‌ను ఎలా నియంత్రిస్తారనేది.. ప్రత్యక్షంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ యంత్ర పరిజ్ఞానాన్ని పరిశీలించి తెలుసుకునే వీలుంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసే సీనియర్‌ ఇంజినీర్లే ఇక్కడ అధ్యాపకులుగా మారి చేస్తున్న బోధనలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.

ఏటా.. సుమారు 800మంది విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఇంటర్న్ షిప్ శిక్షణ అందుకుంటున్నారు. నేర్చుకోవాలనే తపన ఉన్న విద్యార్థులెవరైనా తమ కేంద్రంలో శిక్షణ పొందవచ్చని సంస్థ ఆహ్వానిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details