సభా నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా: బొత్స - jagan
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలని సూచించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇంత అసహనం ఎందుకో అర్థం కావటం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో అన్నారు. "నా అనుభవం అంత లేదు నీ వయసు" అని సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని మంత్రి తప్పుపట్టారు. సభా నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పటి ప్రతిపక్షానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని బొత్స చెప్పారు. సభలో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. తెదేపా సభ్యులు సంయమనం పాటించాలని సూచించారు. సభా సంప్రదాయాలను ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని స్పీకర్ను కోరారు.