ముగిసిన ఏపీ ఎనర్జీ ఇన్నోవేషన్ సమ్మిట్-2019 విజయవాడ నోవోటెల్ హోటల్ వేదికగా 2 రోజుల పాటు " ఏపీ ఎనర్జీ ఇన్నోవేషన్ సమ్మిట్-2019" పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ ఇంధన సదస్సు ముగిసింది. జపాన్, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, పోలాండ్, స్పెయిన్, చైనా, అమెరికాతో పాటు మరిన్ని దేశాలకు చెందిన సుమారు 80 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సంప్రదాయ, పునరుత్పాదక ఇంధన వనరులు, తరగని ఇంధన వనరులపై చర్చించారు. ఈ సదస్సు ముగింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. దేశంలో మొదటిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ కే దక్కుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ లోటుతో ఉన్న ఏపీని నాలుగున్నరేళ్లలో...మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా మార్చామని వెల్లడించారు.సదస్సులో భాగంగా 1366 టెక్నాలజీస్ లాంటి పలు విదేశీ కంపెనీలతో చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది.
తక్కువ ఖర్చుతో సోలార్, విద్యుత్ ఉత్పత్తి చేసే అంశాలపై 200లకు పైగా కంపెనీల ప్రతినిధులు ప్రెజంటేషన్ ఇచ్చారు. ఈ విభాగంలో 10 సంస్థలను ఎంపిక చేశారు. వాటిలో విజేతగా నిలిచిన ఓ సంస్థ కు 4 లక్షలు, మొదటి రెండు రన్నరప్‌లుగా నిలిచిన చకర్, స్కైలాన్సర్ సంస్థలకు వరుసగా 3 లక్షలు, 2 లక్షలు నగదు ప్రోత్సాహకం అందజేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఉపకరణాలను తయారు చేస్తున్న పలు కంపెనీలను ముఖ్యమంత్రి అభినందించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ తొలి ఏడాదిలో రెండో స్థానం దక్కించుకుందన్నారు. తర్వాత 2 సార్లు తొలిస్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం 10.25 శాతంగా ఉన్న వృద్ధి రేటును , 15 శాతానికి పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు.
ఇకనుంచి ప్రతి ఏడాది ఇదే తేదీల్లో అంతర్జాతీయ ఇంధన సదస్సులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సదస్సులో భాగంగా నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో రూపొందించిన "అక్షయ శక్తి మాస పత్రిక"ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఇదే వేదికపై విద్యుత్ ఛార్జీలను పెంచబోమంటూ తయారుచేసిన పోస్టర్ ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ శాఖ అనుబంధ సంస్థ అయిన నెడ్ క్యాప్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు.