రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా... రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇన్నాళ్లూ నరసింహనే గవర్నర్ గా ఉన్నారు. ఇన్నాళ్లకు.. ఆంధ్రాకు ప్రత్యేక గవర్నర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు.. రాష్ట్ర ప్రథమ పౌరుడి అధికార నివాసాన్ని సిద్ధం చేసే పనిలో పడింది ప్రభుత్వం. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చాలని నిర్ణయించగా.. అధికారులు చర్యలు మొదలుపెట్టారు. నాలుగైదు రోజుల్లో కొత్త గవర్నర్ బాధ్యతలు తీసుకుంటారన్న సమాచారం మేరకు.. పనులు వేగంగా పూర్తి చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు.
గవర్నర్ భవనంగా.. సీఎం క్యాంపు కార్యాలయం - రాజ్‌భవన్
చాలా కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు.. కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా.. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్‌ను పంపించనుంది. ప్రథమ పౌరుడికి నివాస ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
bhushan
బిశ్వభూషణ్ నేపథ్యం
ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ ప్రముఖ న్యాయవాది. ఐదుసార్లు శాసనసభ్యుడిగా సేవలు అందించారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు. గతంలో జనసంఘ్, జనతాపార్టీలో కొనసాగారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేసిన హరిచందన్.. 1988లో జనతాపార్టీలో చేరారు. 1996లో తిరిగి భాజపాలో చేరారు. ఒడిశాలో సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా కొనసాగారు. భాజపా, బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు.