రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి రెండోరోజూ అధిక సంఖ్యలో మహిళలు హాజరై ఆనందం వ్యక్తం చేశారు.
పండగగా రెండోరోజూ "చంద్రన్న పసుపు-కుంకుమ" - rajamandri
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి రెండోరోజూ అధిక సంఖ్యలో మహిళలు హాజరై ఆనందం వ్యక్తం చేశారు.
చంద్రన్న పసుపు- కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమాలతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. రెట్టింపు చేసిన పింఛను మొత్తం నేరుగా అందిస్తుండటం వల్ల సభా ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ పథకాలు మహిళల్లో ఆత్మస్థైర్యం పెంచాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.
అనంతపురం జిల్లాలో
అనంతపురం జిల్లాలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని మహిళలకు చెక్కులు అందించారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు, రాయదుర్గం నియోజక వర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
కర్నూలు జిల్లాలో
కర్నూల్లో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో మంత్రి ఎండీ. ఫరూక్, ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నేతలు చెక్కులు పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లాలో
గుంటూరులోని హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. డ్వాక్రా మహిళలకు స్వశక్తితో ఆర్థిక ప్రగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సునీత, గల్లా అరుణాకుమారి, రవీంద్ర పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా పంగులూరు మండలంలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. పింఛన్ల కోసం నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం శాసనసభ్యుడు రవికుమార్ పెన్షన్ నగదు అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో
పశ్చిమగోదావరిజిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను పసుపు కుంకుమ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తమకు భరోసా కల్పించిన సీఎం చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. రాష్ట్రం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నా ప్రజలను ఆదుకుంటామని శేషారావు తెలిపారు. అనంతరం డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్‌లు, పింఛను నగదు పంపిణీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పసుపు-కుంకుమ సభల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్త్రీలు స్వతంత్రంగా బతకడానికి దారి చూపింది తెదేపా ప్రభుత్వమేనన్నారు. పింఛను నగదు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు.
కృష్ణా జిల్లాలో
గుంటూరు జిల్లాలో రెండోరోజూ పసుపు-కుంకుమ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ వేడుకలకు హాజరయ్యారు. సీఎం ప్రతి ఇంటికీ పెద్దకొడుకులా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను ప్రారంభించారు. లబ్ధిదారులకు పింఛన్లు, చెక్కులు అందజేశారు.
విశాఖపట్నం జిల్లాలో
మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా సీఎం కృషి చేస్తున్నారని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ డీఎల్బీ మైదానంలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ తెదేపా ప్రభుత్వం రావడానికి ప్రజలంతా సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు భాజపా ఎమ్మెల్యే విఘ్ణకుమార్ హాజరయ్యారు.